MRPS | సికింద్రాబాద్, మార్చి 13 : సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని సీతాఫల్ మండి చౌరస్తా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ మాదిగ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బొర్రా బిక్షపతి మాదిగలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జెడ్పీటీసీ స్థాయి నుండి ముఖ్యమంత్రి వరకు తన ఎదుగుదలకు కారణం మాదిగలే అని అనేక సభల్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి నేడు ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకువచ్చి మాదిగలకు న్యాయం చేయడాన్ని తన నైతిక బాధ్యతగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మాదిగల వల్ల రేవంత్ రెడ్డికి లాభం జరిగిందే తప్ప ఆయన వల్ల మాదిగలకు ఒరిగిందేమీ లేదన్నారు. అయితే ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ లేకుండానే 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసి మాదిగలకు రేవంత్ సర్కార్ అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు.
ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకురాకముందే గ్రూపు -1, గ్రూప్ -2, గ్రూప్ -3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మొదలగు పరీక్షల ఫలితాలు విడుదల చేసి మరొకసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేసిందన్నారు. మాదిగలకు మాటలు చెప్పి మాలలకు ఉద్యోగాలు దోచిపెడుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మాదిగలు దీక్షలు చేస్తుంటే, ఆ దీక్షలను అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా పాలన అంటే అక్రమ అరెస్టులు, నియంతృత్వ విధానాలు అమలు చేయడమేనా అని ప్రశ్నించారు..? ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం వర్గీకరణ జరగాల్సిందే అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నందరం సీతారాం మాదిగ, వేణుగోపాల్ మాదిగ, శివప్రసాద్ మాదిగ, యాదగిరి మాదిగ, విజయకుమార్ మాదిగ, కొప్పుల సాయికుమార్ మాదిగ, సూరారం సుజాత మాదిగ, సత్యనారాయణ, స్థానిక సీతాఫల్మండి డివిజన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.