కవాడిగూడ, ఏప్రిల్ 28: గ్రేటర్ పరిధిలో అర్హులైన పేదలకు వంద గజాల ఇంటి స్థలం కేటాయించి, ఇంటి పట్టాలు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇంటిని నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేస్తామని ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో చేర్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా ప్రభుత్వ స్థలాలను అమ్మేందుకు ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని కాచగాని సింగారం, నట్టిఅన్నారం, ఆర్.కె.నగర్ గ్రామాల్లో 2003 నుంచి 2004 వరకు ఇచ్చిన మూడు వేల పట్టాలకు సర్వే నెంబర్ 68లో వంద గజాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గుడిసెవాసుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాకి రవి అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, ఎమ్మార్పీఎస్ దక్షిణాది రాష్ట్రాల చైర్మన్ బి.ఎన్.రమేశ్ కుమార్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. కాచగాని సింగారం, సట్టి అన్నారం, ఆర్.కె.నగర్ తదితర ప్రాంతాలలో గుడిసె వాసులకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి మూడు వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించకపోవడం దారుణమని మండిపడ్డారు. వందల కోట్ల రూపాయలకు ప్రభుత్వ స్థలాలను వేలం వేస్తూ అమ్మకానికి పెడుతున్నారని విమర్శించారు. ఇళ్లు లేని పేదలకు పంచాల్సిన ప్రభుత్వ స్థలాలను వేలం వేసి అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని నిలదీశారు. ప్రజా పాలన పేరుతో ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ పాలకులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అర్హులైన గుడిసె వాసులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.