R.Krishnaiah | రవీంద్రభారతి, ఏప్రిల్ 24 : బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్‌చేశారు. లేకపోతే యుద్ధం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీజీలను బలిచేస్తుందని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల కోసమే 12 నెలల క్రితం జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయని తెలిపారు. అలాంటిది బీసీ రిజర్వేషన్ల అంశం పూర్తిగా పరిష్కారం కాకముందే, తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి సీతక్క ప్రకటించడం దారుణమని అన్నారు. బీసీలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు. రిజర్వేషన్లను పెంచకుండానే ఎన్నికలకు వెళ్తే రాష్ట్రంలో యుద్ధం తప్పదని హెచ్చరించారు. దీనిపై వెయ్యి మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వమని అన్నారు.
బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేసి, ఇంతవరకు జీవో ఎందుకు జారీ చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో చట్టం చేశాక కేంద్రానికి పంపుతామని ప్రకటనలు వెలువడ్డాయే తప్ప ఇంతవరకు దానిపై అతీగతి లేదని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, దాన్ని కేంద్రంపై నెట్టివేయడం బీసీలను దగా చేయడం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మీనమేషాలు లెక్కించడం మానుకొని బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీసీల తిరుగుబాటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు.