R Krishnaiah | కవాడిగూడ, ఆగస్టు 3 : రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టల్స్, గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలన్నారు. అద్దె భవనాలలో కొనసాగుతున్న హాస్టల్స్‌కు అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని అన్నారు. ప్రభుత్వ హాస్టల్స్, గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఇందిరాపార్కు వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ నీల వెంకటేష్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. మంత్రులు, ఎంపీల కోసం ఇంద్రభవనాలు నిర్మించుకుంటున్న రాష్ట్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థల హాస్టల్స్‌కు సొంతభవనాలను ఎందుకు నిర్మించడంలేదని నిలదీశారు. హాస్టల్స్‌లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వర్కర్లను పెంచాలన్నారు. ప్రతి నెలా వెయ్యి రూపాయల పాకెట్ మనీని కళాశాల హాస్టల్ విద్యార్థులకు అందజేయాలన్నారు. బీసీలకు 240 రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు 150 బీసీ కళాశాల హాస్టల్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి హాస్టల్‌కు డైనింగ్ హాల్, లైబ్రరీ, టీవీ హాల్ నిర్మించాలన్నారు. బీసీ హాస్టల్స్‌కు సొంత భవనాలను నిర్మించకుంటే మంత్రుల నివాసాలు, క్వార్టర్లు ఆక్రమించుకుంటామని కృష్ణయ్య హెచ్చరించారు. ఫ్లైఓవర్లు, స్కైఓవర్ల నిర్మాణానికి వందల కోట్ల రూపాయలను ఖర్చుచేస్తున్న ప్రభుత్వానికి విద్యార్థుల హాస్టల్స్‌కు సొంత భవనాలను నిర్మించాలన్న సోయి ఎందుకు లేదన్నారు. ప్రభుత్వం వెంటనే బీసీ హాస్టల్స్‌కు సొంత భవనాలను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు అనంతయ్య, పగిళ్ళ సతీష్, పృద్వీగౌడ్, సి.రాజేందర్, మణికంఠ, నిఖిల్, రవికుమార్, ఆశిష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.