R.Krishnaiah | రవీంద్ర భారతి, జూలై 9 : బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఓబీసీ జాతీయ సెమినార్లు జరపాలని సూచించారు. ఇదే డిమాండ్‌తో జూలై 23-24 న చలో ఢిల్లీ జాతీయ సదస్సు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో జాతీయ బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఏపీ అధ్యక్షుడు బోను దుర్గ నరేశ్ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛలో ఢిల్లీ జాతీయ సదస్సు వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ..75 కోట్లకు పైగా ఉన్న బీసీ వర్గాల చిరకాల డిమాండ్‌ను కేంద్రం గౌరవించినట్లుగా ఆయన పేర్కొన్నారు. కుల గణన తర్వాత బీసీలకు చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు పెంపు వంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్లను జనాభా గ్రూపులుగా వర్గీకరణ చేయడానికి జస్టిస్ రోహిణి అధ్యక్షతన కమిటీ నియమించారని, ఆ రిపోర్ట్ ప్రకారం గ్రూపులు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక సంక్షేమ పథకాల రూపకల్పన, అవసరమైన బడ్జెట్ కేటాయింపు, కార్యాచరణ ప్రణాళిక అమలులో ముందడుగు వంటివాటికి మార్గం సుస్పష్టం అవుతుందని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల స్థానాలను కేటాయించడానికి ఉపయోగ పడుతుందని తెలిపారు. ఈ సెమినార్ లో వివిధ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు పాల్గొంటారని తెలిపారు.