MP Asaduddin Owaisi | చార్మినార్, ఫిబ్రవరి 23: మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ కుటుంబానికి భరోసా కల్పించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఆదివారం యాకుత్‌పుర నియోజకవర్గం రెయిన్ బజార్ డివిజన్లోని ఇమిలిబన్ ప్రాంతంలో స్థానిక మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. మహిళ విభిన్న పాత్రలు పోషిస్తూ ఎన్నో బాధ్యతలను నిర్వహిస్తుందన్నారు. కుటుంబ భాద్యతలను మోస్తూ సభ్యులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. అలాంటి మహిళలు ఆర్థిక భరోసా లేకుండా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి ఆర్థిక స్వావలంబన కలిగే విధంగా కృషి చేస్తున్నామని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. కుట్టు మిషన్లను అందిస్తూ, ఇంటివద్దనే మహిళలు ఉపాధి పొందే విధంగా సహకారం అందిస్తున్నామని తెలిపారు. మహిళలు ఆర్ధికంగా ఎదుగుతూ కుటుంబానికి ఆర్ధిక భరోసా అందించాలని సూచించారు. కుటుంబానికి తన సహాయం అందితే ఆ కుటుంబం మరింత ఆర్థిక స్వేచ్ఛ పొంది సంతోషంగా ఉంటుందని ఎంపీ అభిలాషించారు. ఇమిలిబన్లో నిర్వహించిన ఈ పోగ్రాంలో 25మంది మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. ఈ కార్యక్రమంలో యాకుత్‌పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్‌తో పాటు స్థానిక ఎంఐఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.