సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): నార్సింగి మున్సిపాలిటీలో హోర్డింగుల ఏర్పాట్లపై ఉన్నతాధికారుల్లో కదలిక మొదలైంది. ‘నార్సింగిలో హోర్డింగుల అక్రమ సంపాదన’ అనే శీర్షికతో మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్పందించారు. ప్రతి నెలకు రూ.5 కోట్ల మేర ప్రజా సొమ్మును అధికారులు, ప్రజాప్రతినిధులు గత కొన్నాళ్లుగా దారి మళ్లిస్తున్న అంశంపై త్వరలోనే విచారణ చేపట్టేందుకు చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలిసింది. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటైన కాంటిలివర్ హోర్డింగులు దాదాపు వందకు పైగానే ఉన్నాయని, వాటిలో కొన్నింటికి అనుమతులు పొంది.. ఏడాది కిందటే గడువు పూర్తయినట్లు ఓ అధికారి వెల్లడించారు. ఇవన్నీ మున్సిపాలిటీ ఉన్నతాధికారుల కనుసన్నల్లో కొనసాగుతాయని, వారు కేవలం క్షేత్రస్థాయి అధికారులపైనే ఆ నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
మార్చి నెలలోనే గడువు పూర్తయిన హోర్డింగులకు తిరిగి అనుమతులు, రెన్యువల్ చేపట్టవద్దంటూ మున్సిపల్ ఉన్నతాధికారులు ఆకస్మికంగా నోటీసులు జారీ చేశారని టౌన్‌ప్లానింగ్ అధికారులు వెల్లడించారు. అప్పటి నుంచి తాము హోర్డింగుల అనుమతులను పట్టించుకోలేదన్నారు. మంగళవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనుమతులు లేని హోర్డింగులకు నోటీసులు జారీ చేశామని, కొత్తగా ఏర్పాటు చేస్తే తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కోట్లాది రూపాయల అక్రమాలు జరుగుతున్నాయి.. ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ తెలిసినా.. ఎవ్వరూ కిమ్మనకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వచ్చిన కథనంపై ఉన్నతాధికారుల్లో తీవ్రస్థాయిలో చర్చలు జరిగినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. దాదాపు 150కి పైగా కాంటిలివర్, 3 వేలకు పైగా లాలీపాప్‌లు ఉన్నట్లు ప్రాథమిక అంచనా ద్వారా తెలిసింది. అయితే, రూ.5 కోట్లకు పైగానే అక్రమ సంపాదనలు కొనసాగుతున్నాయని స్థానిక ప్రజలంటున్నారు. ఇంత బహిరంగంగా హోర్డింగుల విషయంలో అక్రమాలు జరుగుతుంటే మున్సిపల్ ఉన్నతాధికారులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ.. ప్రజాసొమ్ము పక్కదారి పడుతున్నా.. పట్టించుకోకుండా ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మంగళవారం ప్రచురితమైన కథనంపై ఆర్ అండ్ బీ శాఖలోనూ కలకలం రేపినట్లు తెలిసింది. ఆ శాఖలోని కొంత మంది ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని పై అధికారులకు తెలియకుండానే సొంత నిర్ణయాలతో తమకు నచ్చిన వారికి హోర్డింగులను కేటాయించి.. నెలకు వచ్చే అద్దె డబ్బులను పంచుకుంటున్నారని బహిర్గతమైంది. దీంతో ఆ శాఖలో మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనం చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం. ఇన్నాళ్ల అక్రమ సంపాదనపై విచారణ జరపాలని ఆ శాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది.
మున్సిపాలిటీలో ప్రజాప్రతినిధులుగా కొనసాగుతూ.. హోర్డింగుల వ్యవహారంలో తలదూర్చిన ప్రజాప్రతినిధుల వివరాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ శశాంక మున్సిపల్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మంగళవారం మున్సిపల్ కమిషనర్, టౌన్‌ప్లానింగ్ అధికారులు జాయింట్ కలెక్టర్ వద్ద హాజరయ్యారని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజాప్రతినిధులుగా కొనసాగుతూ.. ఏకంగా తమ పేర్లపై హోర్డింగులను ఏ విధంగా కొనసాగిస్తారని, మున్సిపల్ చట్టం ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ చర్చించినట్లు సమాచారం. కోట్లాది రూపాయల ప్రజా సొమ్మును సొంత జేబుల్లో నింపుకొంటున్న వారిపై విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఉన్నదని కలెక్టర్ శశాంక తెలిపినట్లు అధికారులు తెలిపారు.