సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ) : నగరంలో ఇంధన కొరతతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం తెరిచిన బంక్‌లు మధ్యాహ్నం వరకు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఇటీవల వరుసగా ఇంధన ధరలు పెరగడం.. కొరత వేధించడం వాహనదారులకు కష్టాలు తెచ్చిపెట్టాయి.
సికింద్రాబాద్, బేగంపేట, ఖైరతాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, తార్నాక, దిల్‌సుక్‌నగర్ తదితర ప్రాంతాల్లోని బంక్‌లు చాలా వరకు నో స్టాక్ బోర్డుతో మూసి ఉన్నాయి. దీంతో ఇంధనం దొరికే ప్రాంతాల బంక్‌లకు తిరగాల్సి వచ్చిందని ప్రకాశ్ అనే వాహనదారుడు తెలిపాడు. ఇంకోవైపు సీఎన్జీ కోసం ఆటోలు గంటల తరబడి క్యూలో ఉండాల్సిన పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉందని ఆటో డ్రైవర్ శాతం రమేశ్ చెప్పాడు. ప్రభుత్వం ఇంధన కొరత సమస్యను సత్వరమే పరిష్కరించాలని, బ్లాక్ మార్కెట్ తెరతీసిన బంక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.