సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): అసలే వర్షాకాలం.. చిన్నపాటి వానకే రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దీనికి తోడు రోడ్లపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాన నీటిలో ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీనిపై సంబంధిత అధికారులు ఎంతకూ స్పందించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులే రంగంలోకి దిగారు. ఎవరో వస్తారని..
ఏదో చేస్తారని జీహెచ్ఎంసీ సిబ్బంది కోసం ఎదురు చూడకుండా మియాపూర్ ట్రాఫిక్ పోలీసులే స్వయంగా రంగంలోకి దిగారు. గంపా, పార చేతబట్టి రోడ్లపై ఉన్న గుంతలను సిమెంట్, కంకరతో పూడ్చివేశారు. మియాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్ ఆధ్వర్యంలో సిబ్బంది బాచుపల్లి ఠాణా దగ్గర నుంచి మియాపూర్ వరకు రోడ్లపై ఉన్న దాదాపు 30 నుంచి 40 గుంతలను పూడ్చారు. ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న చొరవను ప్రజలు, వాహనదారులు ప్రశంసించారు.