Mother Murder | శంషాబాద్ రూరల్, మార్చి 13 : ఆస్తికోసం తల్లిని అతి దారుణంగా కొడుకు చంపేసిన ఘటన బుధవారం ఆర్ధరాత్రి శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు రాళ్లగూడ రాఘవేంద్రకాలనీలో నివాసముంటున్న రాచమల్ల చంద్రకళ(55) ఇద్దరు కొడుకులతో కలిసి జీవనం సాగిస్తుంది. పెద్దకొడుకు అయిన రాచమల్ల ప్రకాశ్(38) గతంలో ఇద్దరు భార్యలను పెండ్లి చేసుకొని వదిలేశాడు. మూడో భార్యను పెండ్లి చేసుకున్న ఇతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గతకొంత కాలం నుంచి రాఘవేంద్రకాలనీలో ఉన్న 100 గజాల ఇంటిని ఇద్దరు అన్నదమ్ములకు పంచి ఇవ్వాలని ప్రకాశ్ తల్లిని తరచు వేధిపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసగా మారిన ప్రకాశ్ జూలయిగా మారి నిత్యం మద్యం సేవిస్తు కాలం గడుపుతున్నాడు. బుధవారం రాత్రి సమయంలో మద్యం మత్తులో తల్లితో గోడవపడిన అతడు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను తలపై వేయడంతో పాటు కట్టెలతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలైన ఆమె అక్కడిక్కడే రక్తపుమడుగులో పడిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైయివేటు దవాఖానకు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిన్నట్లు వైద్యులు చెప్పడంతో పోస్టుమార్ఠం నిమిత్తం నగరంలోని ఉస్మానియా దవాఖానకు తరలించారు. తల్లిని చంపిన ప్రకాశ్‌ను పోలీసులు ఆదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.