Hyderabad | హైదరాబాద్‌లో విషాదం నెలకొంది. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. చర్లపల్లి- ఘట్కేసర్ రైల్వే స్టేషన్ మధ్య ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో రైల్వే ట్రాక్‌పై మృతదేహాలను గుర్తించిన గూడ్స్ రైలు లోకోపైలట్ సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
గూడ్స్ రైలు లోకో పైలట్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులను బోడుప్పల్ ప్రాంతానికి చెందిన పిన్నింటి విజయశాంతి(38), కూతురు చేతన రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డిగా గుర్తించారు. చేతన ఇంటర్ సెకండియర్ చదువుతుండగా, విశాల్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నట్లు తెలిసింది. విజయశాంతి ఇద్దరు పిల్లలతో కలిసి బోడుప్పల్ ఉంటుండగా.. ఆమె భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో ఉంటున్నాడని పోలీసులు నిర్ధారించారు.
విజయశాంతి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందని.. నెలకు లక్షకు పైగా జీతం వస్తుందని పోలీసుల విచారణ తేలింది. సురేందర్ రెడ్డి నెల్లూరులోని సిరామిక్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.