సిటీబ్యూరో, మే 9 ( నమస్తే తెలంగాణ ) : మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు తెలంగాణ అంటే ఏమిటో చూపించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక కట్టడాలను లిస్ట్ చేసింది. అందులో కేసీఆర్ నిర్మించిన సచివాలయం, ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం, టీ హబ్, బుద్ధవనం, యాదగిరిగుట్టలనే ప్రధానంగా ఎంపిక చేశారు. వీటిని హైదరాబాద్ అభివృద్ధికి సాక్ష్యంగా చూపించనున్నారు. అంతేకాదు యంగెస్ట్ స్టేట్ తెలంగాణ చరిత్రపై ప్రపంచ ముద్దుగుమ్మలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను సైతం సచివాలయంలోనే ఏర్పాటు చేయడం విశేషం. ఆ పక్కనే ఉన్న అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం, గతంలో కేటీఆర్ వినూత్న తరహాలో అమలు చేసిన ట్యాంక్‌బండ్ సండే ఫన్డేలో సైతం ఈ ముద్దుగుమ్మలు పాల్గొనేలా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. మొత్తంగా కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రపంచానికి చూపించి.. హైదరాబాద్ అదరహో అనేలా కాంగ్రెస్ సర్కార్ ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవడానికి తహతహలాడుతున్నది.
సుమారు 120 దేశాల నుంచి వస్తున్న ముద్దుగుమ్మలను నగరంలోని పలు ప్రతిష్ఠాత్మక కట్టడాలను పరిచయం చేయనున్నారు. 12న నాగార్జున సాగర్‌లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టు, బుద్ధిస్ట్ థీమ్ పార్కును మిస్ కంటెస్టెంట్స్‌లు సందర్శించనున్నారు. అదే రోజు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ ఏర్పాటు చేశారు. 13న చౌమహల్లా ప్యాలెస్‌ను సందర్శించి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో పాల్గొంటారు. మే 15న యాదగిరిగుట్టను సందర్శిస్తారు. 16న ఏఐజీలో మెడికల్ టూరిజం ఈవెంట్‌కు హాజరవుతారు.
17న రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శిస్తారు. 18న తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, తెలంగాణ సచివాలయాన్ని సందర్శించనున్నారు. ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించే సండే ఫన్డే కార్నివాల్లో పాల్గొంటారు. సచివాలయంలో అధికారులు మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌కు తెలంగాణ రాష్ట్ర గ్రోత్ స్టోరీ, చరిత్రను వివరిస్తారు. 21న శిల్పారామంలో తెలంగాణ కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. అదే రోజు టీ హబ్‌ను సందర్శించనున్నారు. మే 10 నుంచి ప్రారంభం కానుండగా 31న హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలే జరుగుతుంది.