Taj Banjara Lake | బంజారాహిల్స్, జూన్ 12 : వర్షాకాలం ప్రారంభమయింది.. ఒకవైపు వర్షాలు కురుస్తుంటే మరోవైపు దోమల విజృంభణ అధికంగా ఉంది. దోమల నివారణ చర్యలు తీసుకోవాలంటూ ఒకవైపు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారులు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే నగరం నడిబొడ్డున ఉన్న తాజ్ బంజారా చెరువులో గుర్రపుడెక్క కారణంగా దోమలు ఉదృతంగా పెరుగుతున్నా పట్టించుకోవడం లేదు.
బంజారాహిల్స్ రోడ్ నెం 1లోని తాజ్ బంజారా చెరువు మొత్తం గుర్రపుడెక్క ఆకుతో నిండిపోయింది. అసలే మురుగునీటితో నిండిపోయిన ఈ చెరువులో గుర్రపు డెక్క పెరిగిపోవడంతో దోమలకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా మారింది. సమీపంలోని శ్రీరాంనగర్, సింగాడకుంట, అంబేద్కర్‌నగర్, కాజానగర్, బోళానగర్ దాకా దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. ప్రతియేటా వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి చెరువులోని గుర్రపు డెక్కను జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారులు తొలగిస్తుంటారు. అయితే ఈ ఏడాది గుర్రపుడెక్క తొలగింపు ఊసే లేకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.
ఇటీవల బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో ప్రీ మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభానికి వచ్చిన జోనల్ కమిషనర్‌కు సైతం గుర్రపుడెక్క సమస్యలపై స్థానికులు ఫిర్యాదులు చేశారు. అయినా ఇప్పటివరకు గుర్రపుడెక్క తొలగింపుపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా స్థానికులు ఎక్స్ ద్వారా జీహెచ్ఎంసీ కమిషనర్‌కు, నగర మేయర్‌కు గుర్రపు డెక్క తొలగించాలని ఫిర్యాదులు చేశారు. వెంటనే గుర్రపు డెక్క తొలగించాలని, దోమల బారినుంచి కాపాడాలని వారు కోరారు.