Cyber Crime | సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): సైబర్‌నేరాల కట్టడికి చర్యలు లేకపోవడంతో ఈ తరహా మోసాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంటున్నది. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మూడు సైబర్ ఠాణాల్లో 10 నెలల్లోనే 12 వేల కేసులకుపైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. దాదాపు ప్రతి రోజూ రూ. 4 నుంచి 5 కోట్ల వరకు బాధితులు సొమ్ము పోగొట్టుకుంటున్నారు. ప్రతి ఏటా కేసుల సంఖ్య 20 శాతం వరకు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ సారి మాత్రం 50 శాతం పెరిగేందుకు చేరువలో ఉన్నాయి.
సైబర్ ఠాణాలతో పాటు శాంతి భద్రతల పోలీస్స్టేషన్లోనూ సైబర్‌నేరాలు నమోదువుతున్నాయి. ఈ కేసులను కలుపుకొంటే సైబర్‌నేరాల సంఖ్య భారీగా పెరుగుతున్నది. సైబర్‌నేరాలు నమోదు చేయడం వరకే నేడు పోలీసులు పరిమితమవుతున్నారు. ఆయా కేసుల్లో రికవరీ మాత్రం అంతంత మాత్రమే ఉందంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. ఇలా సైబర్‌నేరాల్లో కేసుల దర్యాప్తు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటున్నది. బాధితులు పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టేందుకు 1930పైనే పూర్తిగా భారం వేయాల్సి వస్తున్నది.
హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఇటీవల వివిధ రాష్ర్టాల్లో సైబర్‌నేరగాళ్ల కోసం గాలింపు చేపట్టి భారీ సంఖ్యలో నిందితులను అరెస్ట్ చేశారు. అయినా కూడా నేరాలు తగ్గుముఖం పట్టడం లేదు. సైబర్నేరాలను అదుపులో చేయడానికి వివిధ రాష్ర్టాల సైబర్‌క్రైమ్ పోలీసులు సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. దీనికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా తమ వంతు పనిచేస్తున్నది. సైబర్నేరాలను కట్టడి చేసేందుకు ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ట్రై పోలీస్ కమిషనరేట్లలోని సైబర్‌క్రైమ్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ నేరాలను కట్టడి చేయాల్సిన అవసరమున్నా, ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఎవరికి వారే అన్న చందంగా సైబర్ క్రైమ్ విభాగం తయారయ్యిందనే ఆరోపణలు వస్తున్నాయి.
సైబరాబాద్‌లో సైబర్‌నేరాలు ఈ ఏడాది ఇప్పటికే 8 వేలు దాటాయి. కేవలం ఒక్క కమిషనరేట్ పరిధిలోనే ఈ ఏడాది భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అయితే ఇక్కడ రూ. 50 వేల కంటే ఎక్కువగా పోతే ఫిర్యాదులను తీసుకుంటుండగా, హైదరాబాద్‌లో లక్ష రూపాయల కంటే ఎక్కువగా నష్టపోయిన వారి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సైబరాబాద్‌లో భారీగా కేసుల సంఖ్య పెరుగుతున్నదని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. బాధితుల అత్యాశ, భయం, అమాయకత్వంతోనే సైబర్‌నేరాల్లో ఆర్థిక నష్టం ఎక్కువగా జరుగుతున్నది. అయితే గతంలో బ్యాంకు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ, బ్యాంకు ఖాతాలు ఇవ్వకుండా కట్టడి చేయడం వంటి చర్యలకు ఉపక్రమించినా నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉండడంతో జరుగుతున్న నష్టం మరింతగా పెరుగుతున్నదనే విమర్శలు వస్తున్నాయి.
బాధితులు హైదరాబాద్‌లో ఉంటే.. నేరగాళ్లు ఇతర రాష్ర్టాల్లో ఉంటున్నారు. ఇక్కడ నేరం జరిగిన తరువాత బాధితుడి ఫిర్యాదు చేసిన అనంతరం కేసు నమోదు చేసుకొని, నిందితుల వివరాలు పోలీసులు సేకరిస్తారు. అయితే అప్పటికే సైబర్‌నేరగాడు తన బ్యాంకు ఖాతాల్లో బాధితులు డిపాజిట్ చేసిన సొమ్మును దోచేస్తాడు. గతంలో ట్రై పోలీస్ కమిషనరేట్లతో పాటు ఇతర రాష్ర్టాల్లోని సైబర్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేవాళ్లు. నేడు ఆ పరిస్థితి కరువయ్యింది. సైబర్‌క్రైమ్ ఠాణాల్లో సరిపోయేంత సిబ్బంది లేకపోవడంతో సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో కేసు నమోదు చేసి దానిని పక్కన పడేసి, మరో కేసుపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఒక కేసులు నమోదుతోనే తమ పని పూర్తయ్యిందనే భావనతో, కేసుల దర్యాప్తును పక్కన పెట్టేశారనే విమర్శలు వస్తున్నాయి.