Airport Metro | సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ):ప్రముఖ మెట్రో నగరాలన్నింటిలోనూ ఎయిర్‌పోర్టుకు మెట్రో సౌకర్యం అందుబాటులో ఉంది. దీంతో నగరంలోని ఏ మూల నుంచైనా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా మెట్రోరైలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ కారిడార్‌కు రూపకల్పన చేశారు. డిజైన్లను సిద్ధం చేసి, గతేడాది డిసెంబర్ 9న శంకుస్థాపన సైతం చేశారు. ఒకవైపు క్షేత్ర స్థాయిలో ఎయిర్‌పోర్టు మెట్రో పనులు కొనసాగుతుండగానే, ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ అయిన రాయదుర్గం- శంషాబాద్‌ల మధ్య ఉన్న 31 కి.మీ. పరిధిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు మధ్య ఉన్న ఈ ప్రాంతంలో ఊహించని స్థాయిలో శరవేగంగా అభివృద్ధి చోటు చేసుకుంటున్నది. ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో గుర్తించిన మెట్రో అధికారులు ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ కారిడార్‌లో మార్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఇటీవలే మెట్రో ఎం.డి. ఎన్వీఎస్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం ఎయిర్‌పోర్టు ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టులో.. ఆ మార్గంలోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
గచ్చిబౌలి నుంచి ప్రారంభమయ్యే ఔటర్ రింగు రోడ్డు శంషాబాద్ వద్ద ఉన్న బెంగళూరు జాతీయ రహదారి వరకు 24 కి.మీ. ఉంటుంది. ఈ మార్గానికి ఇరువైపులా రాజేంద్రనగర్ వరకు నివాస ప్రాంతాలు భారీ ఎత్తున ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయి అందుబాటులోకి వస్తే మరింతగా జనావాసాలు పెరిగేందుకు అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్ గణనీయంగా పెరిగేందుకు ఆస్కారం ఉండటంతో మెట్రో స్టేషన్లను ప్రతి 2-3 కి.మీ. ఒకటి చొప్పున నిర్మిస్తే భవిష్యత్తు అవసరాలను తీర్చవచ్చని ట్రాఫిక్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి 2-3 కి.మీ. ఒక మెట్రోస్టేషన్‌ను నిర్మించేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నారు. గతంలో 9-10 మెట్రో స్టేషన్లు నిర్మిస్తామని ప్రాథమికంగా నిర్ణయించారు. తాజాగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సర్వేతో వెల్లడైన అనుభవాలను పరిగణలోకి తీసుకొని మరో 5 మెట్రో స్టేషన్లు నిర్మించేందుకు కొన్ని ప్రాంతాలను గుర్తించే పనిలో మెట్రో అధికారులు ఉన్నారు.
ప్రస్తుతం ఐటీ కారిడార్ విస్తరణ మాదాపూర్ నుంచి మొదలై సుమారు 10 కి.మీ. దూరం వరకు ఉన్న కోకాపేట, నార్సింగి వరకు విస్తరించింది. భవిష్యత్తులో ఇక్కడి నుంచి ఔటర్ రింగు రోడ్డు వెంబడి శంషాబాద్ వైపు విస్తరించేందుకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలోని కిస్మత్పూర్లో సుమారు 37 అంతస్తులతో ఒక ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం కాగా, మరో 10 భారీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. రాబోయే మూడేండ్లలో మరిన్ని ప్రాజెక్టులు తెలంగాణ పోలీస్ అకాడమీ, శంషాబాద్, రాజేంద్రనగర్, గగన్‌పహాడ్ ప్రాంతాల్లోనే రానున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. శంషాబాద్ ఓఆర్ఆర్ ఇంటర్ ఛేంజ్ నుంచి ఆరాంఘర్ వెళ్లే మార్గంలోనూ భారీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ వచ్చే మూడునాలుగేండ్లలోనే నిర్మాణం పూర్తి చేసుకోనున్నాయి.
రాజేంద్రనగర్ ఔటర్ రింగు రోడ్డు ఇంటర్‌ఛేంజ్ సమీపంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుమారు 180 ఎకరాల్లో ఐటీ పార్కును ప్రతిపాదించింది. అదేవిధంగా భవిష్యత్తులో మరో 100 ఎకరాల్లో బుద్వేల్, కిస్మత్పూర్ ప్రాంతాల్లో మధ్య వచ్చే ఐటీ పార్కులతో అటు ఐటీ కార్యాలయాలు, ఇటు నివాస ప్రాంతాలు భారీ ఎత్తున ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందుకనుగుణంగా సమీపంలోనే మెట్రో స్టేషన్ అందుబాటులో ఉంటే సొంత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణా వ్యవస్థలో భాగమైన మెట్రోను ఆశ్రయించేందుకు స్థానికులు ఆసక్తి చూపుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్ మధ్య ప్రాంతంలో కొత్తగా వచ్చే నిర్మాణాల సమాచారాన్ని హెచ్ఎండీఏ, స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తీసుకొని మెట్రో అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా కొత్వాల్‌గూడ ఎకో పార్కును హెచ్ఎండీఏ చేపట్టింది. దేశంలోనే అతిపెద్ద అక్వేరియం, ఏవియరీ (పక్షిశాల) కేంద్రాల నిర్మాణాలు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. ఇందుకోసం హెచ్ఎండీఏ రూ.300 కోట్ల వరకు వ్యయం చేస్తోంది. ఇది పూర్తయి సందర్శకులను అనుమతిస్తే నిత్యం వేలాది మంది సందర్శకులు కొత్వాల్‌గూడ ఎకో పార్కుకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ఔటర్ రింగు రోడ్డును, రాజేంద్రనగర్, బుద్వేల్ ప్రాంతాలను ఆనుకొనే ఉండటంతో మెట్రోలో రద్దీ పెరుగనున్నది.
ప్రపంచ స్థాయి కంపెనీల పెట్టుబడులతో ఐటీ రంగం వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. 2021-22 వార్షిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు రూ.1,83,569 కోట్లు ఉండగా, ఉద్యోగులు 7,76,121, అదేవిధంగా 2022-23 వార్షిక సంవత్సరంలో రూ.2,41,275 కోట్లకు ఎగుమతులు పెరుగగా, ఉద్యోగుల సంఖ్య 9.05.715 మందికి చేరింది. కేవలం ఏడాది వ్యవధిలోనే 1.29లక్షల మంది ఐటీ ఉద్యోగులు పెరిగారు. ఇదే పరిస్థితి మున్ముందు ఉంటే.. వచ్చే 5 ఏండ్లలో కొత్తగా 5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు కేవలం నానక్‌రాంగూడ, నార్సింగి, కోకాపేట, మంచిరేవుల, బుద్వేల్ వంటి ప్రాంతాల్లోనే విధులు నిర్వహించే అవకాశం ఉంది. ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే నివాసాలు భారీగా విస్తరించనున్నాయి. ఈ మార్పుల నేపథ్యంలో మూడేండ్లలో నిర్మాణం పూర్తి చేసుకునే ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ డిజైన్లోనూ మార్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.