సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ నుంచి మరిన్ని అధికారాలు హైడ్రా ఆధీనంలోకి వెళ్లాయి. హైడ్రా ఏర్పాటుతో ఈవీడీఎం విభాగం జీహెచ్ఎంసీ నుంచి బదలాయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా మాన్సూన్ ఎమర్జెన్సీ పనులను జీహెచ్ఎంసీ నుంచి తొలగించారు. ఈ పనులను హైడ్రా పరిధిలోకి తీసుకువస్తూ సోమవారం పురపాలక శాఖ సెక్రటరీ ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు హైడ్రా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ పనులకు త్వరలో టెండర్లు పిలిచి మాన్సూన్ ఎమర్జెన్సీ పనులను చేపట్టింది. కాగా, ఇటీవల జీహెచ్ఎంసీ రూ.11 కోట్లతో మాన్సూన్ ఎమర్జెన్సీ, ఇన్స్టంట్ రిపేర్స్ టీమ్ (వెహికల్స్ అండ్ మ్యాన్‌పవర్) టెండర్లలో గోల్మాల్ జరగడం, ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాయడంతో వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే సీఎం సైతం ఒకింత ఆగ్రహం వ్యక్తం చేయడం, వెనువెంటనే జీహెచ్ఎంసీ నుంచి హైడ్రా పరిధిలోకి మాన్సూన్ ఎమర్జెన్సీ పనులను అప్పగించడం గమనార్హం.
సమన్వయం సాధ్యమేనా?
వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా నిర్వహించడంలో గ్రేటర్ డిస్కం, జీహెచ్ఎంసీ, పోలీస్, జలమండలి, హైడ్రా శాఖలు అత్యంత కీలకం. అయితే ఇప్పటికే వర్షాలు పడుతున్న దరిమిలా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సరిగా లేక లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. వాస్తవంగా జీహెచ్ఎంసీ ప్రతి ఏటా మే చివరి వారం నాటికల్లా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలుకు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలి. ప్రతి ఏటా దాదాపు రూ.33 కోట్లతో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ చేపట్టాల్సి ఉంది.
ఏరియాల వారీగా 140 బృందాలు, ప్రత్యేక వాహనాలు, స్టాటిక్ లేబర్స్, మినీ మొబైల్ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఐఆర్టీ పనులకు ఇప్పటికే టెండర్లు పిలవాల్సిన అధికారులు జాప్యం చేశారు. తాజాగా హైడ్రాకు ఈ పనులు అప్పగించడం, టెండర్ ద్వారా ఈ పనులను అప్పగించడం, తక్కువ సమయంలో ఇతర శాఖల సమన్వయం ఏ మేర సాధ్యమవుతుందో హైడ్రాకు సవాల్‌గా మారిందన్న చర్చ జరుగుతున్నది.