Cab Apps | సిటీబ్యూరో, మార్చి 31 ( నమస్తే తెలంగాణ ) : సాధారణంగా క్యాబ్ సర్వీస్‌లో ఫేర్ ఎంత చూపిస్తే అంత చెల్లించాల్సిందే. కానీ ఇప్పుడు అగ్రిగేటర్స్ మధ్య ఉన్న పోటీతో వినియోగదారులకు మరింత సులభతర సేవలు అందించేందుకు సంస్థలు పోటీపడుతున్నాయి. నిర్ణయించిన రైడ్ ధరను సైతం తగ్గించుకునే వెసులుబాటు కల్పిస్తూ ‘ఓకే చలో’ యాప్ సేవలు అందిస్తున్నాయి.
సికింద్రాబాద్ నుంచి బంజారాహిల్స్ వరకు క్యాబ్ రూ.220 చూపిస్తే కొత్తగా వచ్చిన వాటిలో రూ. 200 మాత్రమే చూపిస్తుంది. ప్రస్తుతం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి, ఔటర్ రింగురోడ్డు, ఐటీ కారిడార్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త క్యాబ్ సర్వీసులు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. అలాగే శంషాబాద్ విమానాశ్రయం వద్ద కూడా ఈ సేవలు ఉన్నాయి. గతంలో కేవలం ఓలా, ఉబర్ మాత్రమే సర్వీసులు ఇస్తుండటంతో కమీషన్ల రూపంలో డబ్బులు కట్ అయ్యేవని డ్రైవర్ల్లు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రైడ్స్ సైతం రద్దు చేశారు. కానీ ఇప్పుడు కొత్త యాప్స్‌తో డ్రైవర్లు రైడ్స్ స్వీకరించేందుకు ఆసక్తి కనబరుస్తుండటం విశేషం.
బేగంపేట నుంచి పంజాగుట్టకు క్యాబ్ ధర రూ. 110 చూపిస్తే అందులో కస్టమర్ తాను అనుకున్న అమౌంట్‌ను ఎంటర్ చేస్తే సరిపోతుంది. అందులో సదరు సంస్థ అతి తక్కువలో ఎంతకొస్తదో చూపిస్తుంది. అలా సంస్థ కస్టమర్‌ను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసింది. దీంతో పాటు ఓల్టా వంటివి దూర ప్రయాణికులకు కూడా క్యాబ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఓలా, ఉబర్, ర్యాపిడోకు పోటీగా నగరంలో మనయాత్రి, యారీ, ఓల్టా, ఓకే చలో.. వంటి క్యాబ్ అగ్రిగేటర్స్ వచ్చేశాయి.
దీంతో నగరవాసులు నచ్చిన క్యాబ్‌ను ఎంపిక చేసుకునే అవకాశం లభించింది. డ్రైవర్లు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని గిగ్ వర్కర్స్ ప్రెసిడెండ్ సలావుద్దీన్ తెలిపారు. ఓలా, ఉబర్ వంటి సంస్థల్లో రోజంతా కష్టపడినా వెయ్యి రూపాయలు రావడం లేదని.. ఇప్పుడు కమీషన్లను ఎక్కువగా తీసుకోకుండా కొత్త సంస్థలు డ్రైవర్లకు బెన్ఫిట్ కలిగించేలా మార్పులు తీసుకొచ్చాయని వివరించారు. అంతేకాదు ఓలా, ఉబర్‌లతో పోలిస్తే ధరలు కూడా తక్కువగా ఉన్నాయన్నారు.