Operation Musi | మలక్‌పేట, అక్టోబర్ 4: మూసీ నిర్వాసితులకు పట్టాలు ఇస్తున్నారన్న వార్తలు బయటకు వస్తున్నా, అవి కేవలం డబ్బులు ఇచ్చినవారికే అందుతున్నాయని తెలుస్తుంది. ఒక వైపు ఏండ్ల తరబడి కష్టపడి కట్టుకున్న ఇల్లు పోయి, ఎలాంటి ఆవాసం లేకుండా మిగిలిపోయిన బాధితులకు ప్రభుత్వం ఓదార్పును ఇవ్వకపోగా, పీడించే అధికార యంత్రాంగాన్ని జోడించినదని బాధితులు బాహాటంగా చెబుతున్నారు. డబ్బులు తీసుకొని, అధికారులకు వత్తాసు పలికిన వారి కే అధికార యంత్రాంగం డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను అందిస్తున్నట్టు విశ్వసనీయం గా తెలిసింది. ముసారం బాగ్ మూసీ పరీవాహక ప్రాంతంలోని నిర్వాసితులకు శుక్రవారం సైదాబాద్ మండల తహసీల్దార్, స్పెషల్ అధికారి రాజేశ్ కుమార్ల ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేసినట్టు చెబుతుకుం టున్నా బాధితు లను పీడించి అప్పగిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే, అజయ్ హట్స్, ఆది జాంబవంతుని హట్స్, అంబేద్కర్‌నగర్ బస్తీలలో గురువారం 16 మందికి పట్టాలు ఇవ్వగా, శుక్రవారం సాయిలు హట్స్‌లో 13 మందికి, అజయ్ హట్స్‌లో 18 మందికి పట్టాలు పంపిణీ చేసిన ట్టు తెలిసింది. మొత్తంగా 47 మందికి పట్టాలిచ్చినట్టు తెలిసింది.
డబ్బులు తీసుకొని అధికారులు సహకరిస్తున్నారని వారితో స్థానికులు గొడవకు దిగగా, నిర్మాణాలను కూల్చివేసేందుకే మార్కింగ్ చేశామని తహసీల్దార్ వెల్లడించారు. ముసారం బాగ్‌లోని సాయిలు హట్స్‌లో గత నెల 26న సర్వేచేసి రివర్ బెడ్లో 25 నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు వాటికి మార్కింగ్ చేశారు. కాగా, శుక్రవారం పట్టాలు పంపిణీచేసి ఖాళీ చేయించేందుకు సైదాబాద్ మండల తహసీల్దార్ జయశ్రీ, ప్రత్యేక అధికారి రాజేశ్ కుమార్‌లు సిబ్బందితో రాగా, అందులో అదనంగా మరిన్ని కొత్త నిర్మాణాలు వెలిసి ఉండటం, వాటికి అధికారులు మార్కింగ్ చేసి ఉండటంతో డబ్బులు తీసుకొని వారికి సహకరిస్తున్నారని స్థానికులు అధికారులతో గొడవకు దిగారు. దాంతో కొద్దిసేపు గలాట చోటుచేసుకుంది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించి వేశారు. అయితే, కొత్తగా నిర్మాణాలు వెలిసింది వాస్తమేనని, వాటిని కూల్చివేసేందుకే మార్కింగ్ చేయటం జరిగిందని తహసీల్దార్ జయశ్రీ వారికి తెలిపారు.