GHMC | జూబ్లీహిల్స్, జూలై 2 : ఆస్తి పన్ను వసూళ్లకు నెలవారీ టార్గెట్లు విధిస్తున్నారు. గతంలో ఏడాదికి ఒకసారి ఇచ్చే టార్గెట్లను ఈ ఆర్ధిక సంవత్సరం నుంచి నెలకోసారి ఇస్తున్నారు. దీంతో ఒక్క ట్యాక్స్ కలెక్షన్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. ప్రభుత్వం చేపట్టే వివిధ పథకాలు, కార్యక్రమాలలో భాగస్వాములవుతున్న సిబ్బంది భారీ లక్ష్యాలతో బెంబేలెత్తుతున్నారు. దీంతోపాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సింహభాగం వున్న యూసుఫ్‌గూడా సర్కిల్లో ట్యాక్స్ కలెక్షన్ సిబ్బందిని రానున్న అసెంబ్లీ ఎన్నికల పనులకు కూడా వినియోగిస్తుండడంతో కొండంత టార్గెట్లను చూసి బేంబేలెత్తే పరిస్థితి నెలకొంది.
ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ నెలలో ఎర్లీబర్డ్ ఆఫర్ ఇచ్చిన జీహెచ్ఎంసీ యూసుఫ్‌గూడా సర్కిల్‌కు రూ. 15.01 కోట్ల టార్గెట్ ఇచ్చింది. ఇందులో 5 శాతం రిబేట్ ఇవ్వడంతో రూ. 10.45 కోట్లు వసూలైంది. అయితే అ తరువాత ఆఫర్లు లేకపోవడంతో మే నెలలో రూ. 7.85 కోట్లు.. జూన్ నెలలో రూ. 8 కోట్లు టార్గెట్ ఇచ్చినప్పటికి అంతంత మాత్రమే వసూలైంది. గతేడాది రూ. 33 కోట్లుగా ఉన్న యూసుఫ్‌గూడా సర్కిల్ ఆస్తి పన్ను లక్ష్యం ఒక్కసారిగా రూ. 140 కోట్లుగా పెంచారు. ఆ తరువాత సాంకేతిక కారణాలతో ఆస్తి పన్ను లక్ష్యం పెరిగి ఉండవచ్చని టార్గెట్ తగ్గించారు. అయితే ఈ ఏడాది నెలవారీ ఇచ్చే టార్గెట్లతో ఆస్తి పన్ను లక్ష్యం రూ.100 కోట్లకు దాటుతుందన్న అంచనా కనబడుతుంది. దీంతో బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు ఈ టార్గెట్లు చూసి భయపడి పోతున్నారు. ఆయా సిబ్బందిని కేవలం ఆస్తి పన్ను వసూలుకే వినియోగించినా వారికి విధించిన టార్గెట్లు వసూలవుతాయో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.