వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ప్రజలు భయంతో వణికిపోతుంటే..కాంట్రాక్టర్లు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం, రహదారులను జలమయం కాకుండా చూడాల్సిన ‘మాన్సూన్ ఎమర్జెన్సీ పనులు కాస్తా కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపించే ‘మనీసూన్’ దోపిడీగా మారాయి. నీటివనరుల పునరుద్ధరణ, వర్షాకాలంలో ఎమర్జెన్సీ పనులపై గాంభీర్యాలు పలికే హైడ్రా అధికారుల పనితీరు.. ఈ యేడాది వర్షాకాలంలో పడిన చిన్నపాటి వానలకే తేలిపోయిందనే నగరవాసుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు టెండర్ పనులపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో హైడ్రా గౌరవాన్ని మరింత మసకబారినట్లు చేస్తున్నాయంటూ సిటిజనుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగోతోంది.
సిటీబ్యూరో/మల్కాజిగిరి, జూలై 6 (నమస్తే తెలంగాణ): నగరంలో మాన్సూన్ (వర్షాకాలం) పనులు గుత్తేదారులతో పాటు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.టెండర్ నిబంధనల ప్రకారం వర్షాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా తక్షణమే స్పందించేందుకు వీలుగా కార్మికులు 24 గంటలూ అందుబాటులో ఉండాలి. ఇందుకోసం రోజుకు 3 షిప్టుల్లో కార్మికులను రంగంలోకి దించాల్సి ఉంది. హైడ్రా టెండర్ నిబంధనలు కూడా ఇవే చెబుతున్నాయి…కానీ కాంట్రాక్టర్లు లాభాల కక్కుర్తితో నిబంధనలను అడ్డంగా ఉల్లంఘిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కేవలం ఒక్క షిప్టుతోనే పనులను కానిచ్చేస్తున్నారు.
మిగిలిన రెండు షిప్టుల కార్మికుల జీతభత్యాలను దారి మళ్లిస్తున్నారు. ముఖ్యంగా పూడికతీత, నాలాల క్లియరెన్స్, ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాల్సిన ఈ ఎమర్జెన్సీ బృందాలు ఆకాశానికి చిల్లు పడితేనే బయటకు వస్తున్నారు..ఈ నేపథ్యంలోనే పనుల్లో నిర్లక్ష్యం వహించిన నాలుగు ఎంఈటీ నిర్వహణ ఎజెన్సీల టెండర్లను హైడ్రా అధికారులు ఇటీవల రద్దుచేశారు. ఐతే తిరిగి కొత్తగా షార్ట్ టెండర్ పిలిచిన అధికారులు తిరిగి వారికే పనులు దక్కేలా వ్యవహరిస్తుండటం గమనార్హం. తప్పు చేసిన ఏజెన్సీలకే అగ్రతాంబూలం వేస్తుండటం వెనుక కొందరు అధికారులు చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతున్నది.
పర్యవేక్షణ కరువు..
ప్రతి ఏడాది చేపట్టే మాన్సూన్ పనులు కాంట్రాక్టర్లకు వరంగా మారాయి. కోట్ల రూపాయాలతో చేపట్టే మాన్సూన్ పనుల్లో పెద్దమొత్తంలో అవినీతికి దారితీస్తుంది. మాన్సూన్ పనుల కోసం 20 శాతం పైగా లెస్ వరకు టెండర్లు వేసి మరీ దక్కించుకోవడం వెనుక పెద్ద మతలబే ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది దాదాపు రూ.70 కోట్లతో 62 చోట్ల ఎంఈటీ (ఎమర్జెన్సీ బృందాలను) ఏర్పాటు చేశారు. 300 డివిజన్లకు గానూ ఈ బృందాలు వర్షాకాలం ముగింపు అంటే 5 నెలల పాటు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉండాలి.
కానీ ఈ ఎమర్జెన్సీ బృందాల పనితీరు సరిగా లేకపోయినప్పటికీ హైడ్రా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మాన్సూన్కు సంబంధించి క్యూర్ పరిధిలోని 300 డివిజన్లలో 3,600 మంది షిప్ట్‌ల వారీగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ సగం మందితోనే పనులు చేపడతున్నారు. తూతూ మంత్రం పనులతో మాన్సూన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్నారు.? ఎవరు పనిచేస్తున్నారో? హైడ్రాకే తెలియని దుస్థితి ఉంది.
ఉప్పల్ సర్కిల్లో మచ్చుకు ఓ ఉదాహరణ….
ఉప్పల్ సర్కిల్లో మాన్సూన్ పనులకు టెండర్‌ను ఒక్కరే దక్కించుకున్నారు. మరి ఎక్కువగా లెస్‌కు వేసి, టెండర్‌ను పొందినట్లు తెలుస్తున్నది. అయితే ఉప్పల్ సర్కిల్లో 6 డివిజన్లు ఉన్నాయి. 6 డివిజన్లకు 6 మాన్సూన్ టీంలు ఏర్పాటు చేయాలి. వీటిలో మూడు షిఫ్ట్ట్లలో నలుగురు సిబ్బంది ఉండాలి, రాత్రి సమయంలో డ్రైవర్లు ఇద్దరు ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే ఇక్కడ మాత్రం డివిజన్‌కు నలుగురు సిబ్బంది, ఒక డ్రైవర్‌తోనే మూడు షిఫ్ట్టులు పనిచేయిస్తున్నట్లు తెలుస్తుంది. వీటికి తోడు ఉప్ప ల్, చిలుకానగర్, బీరప్పగడ్డ డివిజన్‌కు సంబంధించి మోడ ల్ మార్కెట్లో బస ఏర్పాటు చేశారు.
వీరు మూడు డివిజన్లను కవర్ చేస్తున్నారు. అంటే సగం సిబ్బందితోనే పనులు చేపడుతున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన సూపర్వైజర్లు, హైడ్రా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి నెలకు రూ.20 వేల చొప్పున ఇతర జిల్లాల నుంచి లేబర్‌ను తీసుకువచ్చి, మూడు షిప్టులు పనిచేయించుకుంటున్నారు. ఉప్పల్ సర్కిల్లో రూ.96,35,475 నిధులు కేటాయించారు. ఈ నిధులు ఎంత వరకు సద్వినియోగం చేస్తారో వేచి చూడాలి. వీటిపై జోనల్ కమిషనర్ ప్రత్యేక దృష్టిసారించి, పనులు పారదర్శకంగా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
వాహనాల ఫిట్నెస్ ప్రశ్నార్థకం…
మాన్సూన్ సందర్భంగా ప్రతి డివిజన్‌కు ఒక వాహనం ఉండాలి, అంటే క్యూర్ పరిధిలో 300 వాహనాలు తిరుగుతున్నాయి. వీటికి ఫిట్నెస్ ఉందా, కాలం చెల్లిన వాహనాలు వాడుతున్నారా అనేది ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టాల్సి ఉంది. టెండర్లో ఒకలా, క్షేత్రస్థాయిలో మరో వాహనం తిరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. వీటితోపాటు డ్రైవర్లుగా పనిచేస్తున్నవారి వివరాలు, సిబ్బంది ఎంతమంది పనిచేస్తున్నారు, షిప్టుల వారీగా పనిచేసే సిబ్బంది వివరాలు నమోదులేదు. ఏదైన ప్రమాదం జరిగితే బాధ్యత ఎలా వహిస్తారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 3 నెలల కాలం మించితే ఈఎస్ఐ తప్పక ఉండాల్సి ఉంటుంది, అయితే కాంట్రాక్టర్లు వీటిని పట్టించుకోవడంలేదు. ఫార్మ్ ప్రకారం సిబ్బంది ఉన్నారా, వారికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు అనే వాటిపై పర్యవేక్షణ లేదు. పనిచేస్తున్న సిబ్బందికి సెఫ్టీ పరికరాలు, సామగ్రి ఉండాలి, కానీ వాటిని వాడుతున్న సందర్భాలు లేవు.
తప్పు చేసినోళ్లకే మళ్లీ అగ్రతాంబూలం
ఈ మాన్సూన్ పనుల్లో జరుగుతున్న అవినీతి, నిర్లక్ష్యంపై అరోపణలు రావడంతో అధికారులు నాలుగు ఏజెన్సీలపై చర్యలు తీసుకున్నారు. వాస్తవంగా వీరిని బ్లాక్‌లిస్టులో పెట్టి మళ్లీ టెండర్లు పిలిచి కొత్తవారికి పనులు అప్పగించాలి..కానీ షార్ట్ టెండర్ పిలిచి మళ్లీ వారికే పనులు దక్కేలా పావులు కదుపుతుండటం గమనార్హం. వాస్తవంగా ఈ సారి ఎంఈటీ టెండర్లలో ఒక్కో ఎజెన్సీ మూడు నుంచి ఆరు చోట్ల పనులు దక్కించుకున్నాయి.
అత్యధికంగా కె.యాదగిరి రెడ్డి, వి.సురేష్, ఎన్ వెంగళ్రావు, శ్రీ సాయిరాం ఎంటర్ప్రైజెస్, రాయన్షికా ఎంటర్ప్రైజెష్, శ్రీదేవి లునావత్ పేర్లతో భారీ ఎత్తున పనులు దక్కించుకున్నాయి. ఐతే వీరికి కేటాయించిన చోట్ల పనులు పారదర్శకంగా జరగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నాలుగు ఏజెన్సీల లోపాలు వెలుగులోకి వచ్చినా అధికారులు మాత్రం వెనుకేసుకుంటూ రావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏ విధంగా స్పందిస్తారో అన్న చర్చ జరుగుతున్నది.