ఖైరతాబాద్, జూలై 31 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు విశ్వకర్మలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం విశ్వకర్మల సంఘాల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నర్సింహాచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2018లో కాంగ్రెస్ పార్టీ తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ్యులుగా ఉన్నారని, కమిటీ కన్వీనర్‌గా తనకు మ్యానిఫెస్టో డ్రాఫ్ట్ రూపొందించే అవకాశం దక్కిందన్నారు.
ఆ తరుణంలో బీసీలతో పాటు విశ్వకర్మలకు ఇవ్వాల్సిన హామీలను అందులో పొందుపర్చానన్నారు. కమ్మరి, వడ్రంగి కులవృత్తులను అత్యాధునిక యంత్ర సామగ్రి కోసం ఆర్థిక సాయం, సబ్సిడీపై బొగ్గు, ఇనుము, కడప రాళ్లు అందించడం, ప్రభుత్వంలో జరిగే వృత్తిపరమైన పనులకు లైసెన్స్ ఉన్న విశ్వబ్రాహ్మణులకే కాంట్రాక్టులు, జ్యువెల్లరీ పార్కు ఏర్పాటు, పుస్తెలు, మెట్టల తయారీ అనుమతులు కంసాలి వర్గానికి మాత్రమే ఇవ్వాలి, రెడీమేడ్ మెట్టలపై నిషేధం, స్వర్ణకారులకు ఉద్యోగ భద్రత కల్పన, అటవీ శాఖ దాడులు, పోలీసుల వేధింపుల నియంత్రణ తదితర అంశాలను చేర్చారన్నారు.
అయితే నాటి మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, సభ్యులు ప్రస్తుత కేబినెట్ మంత్రులుగా ఉన్నారని, నాడు విశ్వకర్మల డిమాండ్‌ను మ్యానిఫెస్టోలో పెట్టి ప్రచారం చేశారని, ఆ హామీలన్నీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. నాగరికతకు పునాదులు వేసిన వారే విశ్వకర్మలని, మలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ వారే కీలకమని, కానీ నేడు దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారన్నారు.
అనేక మంది వృత్తిలో మనుగడ సాధించలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీసీల 42 శాతం రిజర్వేషన్లపై పెద్ద యుద్ధమే జరుగుతున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏవో సాకులు చెబుతూ దాటవేసే ధోరణిని ప్రదర్శిస్తున్నారన్నారు. బీసీలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. .. 42 శాతం ఇస్తే సరిపోదని, బీసీలో ఏబీసీడీ వర్గీకరణ ద్వారా అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.
బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు చిరంజీవులు మాట్లాడుతూ 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం విశ్వకర్మలు 10 లక్షల జనాభా ఉన్నారని, రాష్ట్ర అసెంబ్లీ నుంచి 5 నుంచి 6 శాసనసభ్యులు ఉండాలని, కానీ ఆ అవకాశం ఇవ్వలేదన్నారు. రాజ్యధికారాన్ని దూరంగా ఉండడం వల్లే వారి సమస్యలను పరిష్కరించడం లేదన్నారు.
ప్రస్తుతం కులవృత్తులు అంతరించిపోతున్నాయని, అయిల్ ఫ్యాక్టరీలన్నీ ఇతర వర్గాల చేతుల్లో ఉన్నాయన్నారు. విశ్వకర్మలు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని ఆర్థిక స్వావలంబన పొందాలని, చట్ట సభల్లో స్థానం సంపాదించుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉపేంద్ర చారి, దుబ్బాక కిషన్చారి, కుందారం గణేశ్ చారి, కృష్ణమూర్తి, సత్యం, సుంకరి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.