దుండిగల్,జూన్13: తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంతో పాటు తన పరిపాలనలో రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చి దేశానికే ఆదర్శంగా నిలిపిన మహానేత కేసీఆర్ అని ఆయన సాధించిన రా్రష్ట్రంలో హోదా,పదవులు అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఎంతమాత్రం లేదని బీఆర్ఎస్ ఎల్పీ విప్,ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ తొలిముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై వివేకానంద్ మండి పడ్డారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విప్ అంటే ప్రభుత్వాన్ని,ప్రతిపక్ష పార్టీతో సమన్వయం చేస్తూ నడిపించాల్సి ఉంటుందని,అందుకు విరుద్దంగా ఆదిశ్రీనివాస్ తన బాధ్యతలను మరిచి,బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికే అధికప్రాధాన్యతను ఇస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రభుత్వవిప్ తన దిగజారుడు,చిల్లరమాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటిందని అధికారంలోకి వచ్చిన రెండేండ్ల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడినా,ధనబలంతో గెలువాలని చూసినా ప్రజలైతే మీ వైపు లేరన్నారు. ప్రజలు కేసీఆర్‌ను బలంగా కోరుకుంటున్నారని,ఆయన సైనికులుగా మేమంతా ఉంటేనే మీ పరిస్థితి ఇలా ఉంటే ఇక ఆయన బయటకు వస్తే మీరు తట్టుకోగలరా…? ప్రజలే మీపై తిరగబడతారు అంటూ హెచ్చరించారు.కేసీఆరే లేకపోతే తెలంగాణ ఎక్కడిది…?మీరు అనుభవిస్తున్న ఈ పదవులు ఎక్కడివి..?కేసీఆర్‌ను అనే స్థాయి మీ నాయకులు రేవంత్‌రెడ్డికే లేదని,ఇక కేసీఆర్ ముందు నువ్వు ఎంత…?నీ స్థాయి ఎంత..? కేసీఆర్ కాలిగోటికి సరిపోవంటూ ఎద్దేవా చేశారు.