Talasani Srinivas Yadav | హైదరాబాద్ : సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయంలో త్వరలోనే అమ్మవారి నూతన విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తామని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం ముత్యాలమ్మ ఆలయాన్ని తలసాని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నూతన విగ్రహ ప్రతిష్ఠాపనపై ఆలయ నిర్వాహకులు, బస్తీవాసులతో మాట్లాడినట్లు తెలిపారు. దీపావళికి అటుఇటుగా కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు పేర్కొన్నారు. నూతన విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా కుంభాభిషేకం, మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించాలని పండితులు చెప్పినట్లు తెలిపారు. ఈ మూడు రోజుల పాటు బస్తీలో ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పుతామన్నారు. ఎలాంటి రాజకీయ ప్రమేయాలు లేకుండా బస్తీ వాసుల సమక్షంలోనే విగ్రహాన్ని ప్రతిష్టించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.