అమీర్‌పేట్, డిసెంబర్ 10: సనత్‌నగర్ డివిజన్ అల్లాద్దీన్ కోఠి బస్తీకి ఆనుకుని నిర్మిస్తున్న గ్యాస్ సిలిండర్ల గోదాము పనులను వెంటనే నిలిపివేయాలని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. జనావాసాలకు అతి సమీపంలో నిర్మితమవుతున్న ఈ గ్యాస్ గోదామ్ తమ భద్రతకు పెనుముప్పుగా పరిణమించిందంటూ బస్తీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో బుధవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ హైడ్రా, టౌన్‌ప్లానింగ్, పౌరసరఫరాల విభాగం అధికారులతో కలిసి గ్యాస్ గోదామ్ పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ గోదామ్ ఏర్పాటు పట్ల స్థానికుల అభ్యంతరాలను ప్రభుత్వ విభాగాలు పరిగణలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. తక్షణమే గ్యాస్ గోదామ్ నిర్మాణ పనులను నిలిపివేయాలని, ఇందుకు అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కాలనీవాసులు భయపడాల్సిన పనిలేదని.. అండగా ఉంటామని తలసాని భరోసానిచ్చారు. ఎమ్మెల్యే వెంట హైడ్రా డీఎఫ్‌వో మోహన్‌రావు, పౌరసరఫరాల ఏఎస్వో బీ జ్యోతి, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ సతీష్ తదితరులతో పాటు బీఆర్ఎస్ సనత్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు కొలను బాల్‌రెడ్డి, నాయకులు.. ఖలీల్‌బేగ్, ఫాజిల్, రాజేష్ ముదిరాజ్, సురేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.