హైదరాబాద్ : ఇది ప్రజా ప్రభుత్వం కాదని..దగా ప్రభుత్వం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. బుధవారం ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీలకు రాజకీయం, విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రెండు సంవత్సరాలు అవుతున్నా అమలు చేయకుండా బీసీలకు తీరని మోసం, దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ లో బిల్లు ఆమోదించి 9 వ షెడ్యూల్ లో చేరిస్తేనే చట్టబద్దత లభిస్తుందని బిల్లు పెట్టిన సమయంలోనే తాము ప్రభుత్వానికి స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మొదటి నుండి కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ల విషయంలో చిత్తశుద్దితో లేదని విమర్శించారు. బీసీల పట్ల నిజంగా ప్రేమ ఉంటే బిల్లుకు చట్టబద్దత కోసం రాష్ట్రపతిని ఎందుకు కలవలేదని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పై ఎందుకు వత్తిడి తీసుకురాలేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ లో నిర్వహించిన ధర్నాకు కాంగ్రెస్ అద్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ వంటి అగ్రనేతలు ఎవరు కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
సమాజంలో 50 శాతంకు పైగా ఉన్న బీసీలకు సర్పంచ్ ఎన్నికలలో 17.08 శాతం కేటాయించి అవమానిస్తారా ? అని ప్రశ్నించారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో రేవంత్ రెడ్డి బిసి లను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సర్పంచ్ ఎన్నికలను నిలిపివేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ లతో ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు దమ్ముంటే మీరు పార్టీ పరంగా ఇస్తామన్న 60 శాతం రిజర్వేషన్ తో జాబితాను వారం రోజులలో ప్రకటించాలని సవాల్ చేశారు. రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నాయకులు బీసీ సమాజం ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని అన్నారు.