హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సమాజాన్ని మరోసారి మోసం చేస్తోందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. కులగణన సక్రమంగా చేయలేదు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను నేటి వరకు బహిర్గతం చేయలేదని విమర్శించారు. ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా పేరుతో హంగామా చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నాకు ఆ పార్టీ అగ్రనేతలు ఎవరు హాజరు కాలేదని గుర్తు చేశారు. బీసీ సబ్ ప్లాన్ కింద ఏడాదికి 20 వేల కోట్లు అన్నారు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ, చేతి వృత్తులకు సాయం అన్నారు. రెండేళ్లు అవుతున్నా నేటి వరకు ఏ ఒక్కటి అమలు చేయలేదని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్ల అమలుతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మోసపూరిత వాగ్ధానాలతో 50 శాతానికి పైగా ఉన్న బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారు. బీసీ నేతలు, మేధావులతో కలిసి అన్ని జిల్లాలలో ఆందోళనలు చేపట్టి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. యాభై శాతానికి పైగా ఉన్న బీసీలకు భిక్షమేస్తారా? రేపు తెలంగాణ భవన్లో మా పార్టీ బీసీ నాయకత్వంతో సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని తలసాని తెలిపారు.