యాదాద్రి భువనగిరి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు. సోమవారం యాదాద్రికి చేరుకున్న ఎమ్మెల్యే మొదటగా స్వయంభూలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.
పునర్నిర్మిత యాదగిరి గుట్ట ఆలయం అద్భుత శిల్పకళతో శోభాయమానంగా కనువిందు చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో దూపదీప నైవేద్యాలకు సైతం రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఉండేదన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలోని ఆలయాలకు మహర్దశ పట్టిందన్నారు.