వనస్థలిపురం, మార్చి 18 : ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని బిఎన్.రెడ్డి నగర్ డివిజన్లో రిజిస్టేష్రన్ ల సంవత్సరాలపై గత ప్రభుత్వం తీసుకొచ్చిన 118 అమలు తీరుపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. 44 కాలనీలలో పేద, మధ్య తరగతి ప్రజలు రిజిస్టేష్రన్ చేసుకుని ఇండ్లు కట్టుకుని నివాసముంటున్నారని వారికి 2007 నుండి ఇండ్లు, ప్లాట్ల రిజిస్టేష్రన్ ఆపేశారన్నారు. వారి ఇబ్బందులు తెలుసుకుని అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం 118 జీఓ విడుదల చేసిందని దానివల్ల సుమారు 75 శాతం వరకు కాలనీవాసులు లబ్ది పొందారని తెలిపారు. ఇంకా 25 శాతం మంది లబ్ది పొందవలసి ఉండగా ప్రభుత్వం ఫిబ్రవరి 2023 నుంచి జీవో అమలును ఆపేసిందన్నారు.
దాంతో చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. ఈ సమస్యలు పరిష్కరించడానికి కొన్ని అంశాలను స్పీకర్ కు సంబంధించిన మంత్రికి విన్నవించడం జరిగింది. దానిలో భాగంగా 118 జీవో అమలును తిరిగి పునరుద్ధరించాలని, జీవో ద్వారా కన్వేయన్స్ డిడ్స్ పొందిన వారందరిని, సబ్ రిజిష్టర్ ఆఫీసులోని వెబ్ సైట్ లో 22ఎ భూమి నిషేధిత చట్టం నుండి మినహాయించాలన్నారు. ఈ సమస్యలను పరిష్కరించి ఎల్.బి.నగర్ నియోజకవర్గంలోని వేలాది కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన రెవెన్యూశాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సుధీర్ రెడ్డి ప్రతిపాదనలు చేసిన అంశాలు పరిగణలోకి తీసుకొని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.