హయత్ నగర్, ఏప్రిల్ 9 : సొంత నిధులతో కాలనీవాసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని హయత్ నగర్ డివిజన్ సూర్య నగర్ కాలనీవాసులు తమ సొంత నిధులు దాదాపు రూ.3 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నవ జీవన్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్క అభివృద్ధి విషయంలో ప్రభుత్వం మీద ఆధారపడకుండా తమ సొంత నిధులతో సీసీ కెమెరాలు ఎర్పాటు చేసుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయమని తెలిపారు.
ఎల్బీనగర్ ను నేర రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన కర్తవ్యమని, అందుకు అనుగుణంగా నియోజకవర్గంలో దశలవారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీసీ కెమెరాల గురించి కూడా ప్రజల్లో అవగహన కల్పిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, మల్లేష్ ముదిరాజ్, భాస్కర్ సాగర్, కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.