కంటోన్మెంట్, జూలై 22: నాలాల అభివృద్ధికి కంటోన్మెంట్ బోర్డుకు జమైన పరిహారపు నిధులను వినియోగించాలని బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ కు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు. ఈ మేరకు మంగళవారం బోర్డు కార్యాలయంలోబోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ను బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ తో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కంటోన్మెంట్ బోర్డుకు సమకూరిన రూ. 303 కోట్లతో నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.
ప్రధానంగా కూకట్ పల్లి నుండి వచ్చే నాలా, హస్మత్ పేట్, పికెట్ నాలాల అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సీఈఓకు సూచించారు. దీనిపై సీఈవో సానుకూలంగా స్పందిస్తూ బోర్డు పరిధిలో ఎక్కడెక్కడ పనులు అవసరమో దృష్టి కేంద్రీకరిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో నాలాల అభివృద్ధి పనులు చేసేటప్పుడు ఆయా కాలనీల, బస్తీల వాసులను కలసి వారిని మెప్పించి, వారితో సమన్వయం చేసుకొని కొనసాగించాలని ఎమ్మెల్యే సూచించారు.