బడంగ్ పేట్, జూన్ 19: రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తామని హైడ్రా అధికారులు అత్యుత్సాహం ఎందుకు చూపుతున్నారో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. పేదలకు నోటీసులు జారీ చేసి భయభ్రాంతులకు గురిచేయడం మంచి పద్ధతి కాదని ఆమె అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మునిసిపాలిటీ పరిధిలోని కుబా కాలనీలో గురువారం ఎమ్మెల్యే పర్యటించారు. హైడ్రా అధికారులు తమ ఇండ్లు కూల్చివేస్తామని నోటీసులు ఇచ్చారని కాలనీవాసులు ఎమ్మెల్యే ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఇళ్లు కూల్చివేస్తే ఎక్కడ ఉండాలో అర్థం కావడంలేదని కన్నీటి పర్యంతమయ్యారు.
బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది..
సబితారెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదల ఇళ్లు ఎలా కూల్చివేస్తారో చూస్తాం.. ఎవరూ భయపడవద్దని భరోసానిచ్చారు. పేదలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. బడాబాబులను వదిలేసి పైసా పైసా కూడాపెట్టి పేదలు కట్టుకున్న ఇండ్లపైన హైడ్రా అధికారుల జులుం ఏందన్నారు. మొదట చెరువుల ప్రాంతాలలో కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కుబా కాలనీలో ఉన్న పేదల ఇండ్ల జోలికి ఎవరు పోకుండా చర్యలు తీసుకోవాలని బాలాపూర్ తహసీల్దార్‌కు ఎమ్మెల్యే సబితారెడ్డి ఫోన్లో సూచించారు.
నిరుపేదల జోలికి వస్తే సహించేది లేదన్నారు. తదనంతరం మున్సిపాలిటీ పరిధిలోని 28వ డివిజన్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు పనులను ఆమె పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకట్రామ్, మాజీ సర్పంచ్ సూరెడ్డి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు