బాలాపూర్ మండలంలో రేషన్ కార్డుల పపింణీ కార్యక్రమం రసాభాసగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రొటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సొంత కార్యక్రమంలా మార్చేశారని గులాబీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు ఓవర్‌యాక్షన్‌తో బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
– బడంగ్‌పేట, ఆగస్టు 5
బాలాపూర్ మండల పరిధి మల్లాపూర్ ఏవైఆర్ గార్డెన్లో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం మధ్యాహ్నం 2:15 నిమిషాలకు ప్రారంభమైంది. అయితే కార్యక్రమం మొదలు కావడంతోనే ప్రొటోకాల్‌పై రగడ మొదలైయింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి హాజరైన ఈ కార్యక్రమంలో.. మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, బడంగ్‌పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, వై అమరేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు వేదికపై కూర్చున్నారు.
ఇదే కార్యక్రమంలో మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి పాల్గొన్నారు. అయితే సభలో ప్రొటోకాల్ పాటించకపోవడంపై ఎమ్మెల్యే సబితారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారికంగా నిర్వహించవలసిన కార్యక్రమంలో సంబంధం లేని వ్యక్తులను ఎలా కూర్చోబెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు కూడా తోడవడంతో సభా ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. ‘ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం’ అంటు గంటల తరబడి నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ నాయకులు కూడా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
గాంధీభవన్‌లో నిర్వహించుకోవాలి
సబితారెడ్డి మాట్లాడుతూ.. ఒకవేళ ఇది పార్టీ కార్యక్రమం అయితే గాంధీ భవన్లో నిర్వహించుకోవాలని.. తమకేమీ అభ్యంతరం లేదన్నారు. అధికారిక కార్యక్రమం అయితే ప్రోటోకాల్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. సంబంధం లేని వ్యక్తులు వేదికపై కూర్చుంటే మంత్రి ఎందుకు అభ్యంతరం చెప్పరని సబితారెడ్డి ప్రశ్నించారు. చట్టానికి విరుద్ధంగా కార్యక్రమాలు చేస్తామంటే అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని సభావేదిక నుంచి దిగిపోయిన ఎమ్మెల్యే సబితారెడ్డి.. దాదాపు రెండుగంటల పాటు ఎమ్మెల్సీ వాణీదేవి, బీఆర్ఎస్ నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
పేద ప్రజలకు అధికారికంగా ఇవ్వాల్సిన రేషన్ కార్డుల పంపిణీని రాజకీయం చేయడం మంచి పద్దతి కాదన్నారు. గతంలో ప్రొటోకాల్ పాటించలేదన్న నాయకులు అప్పడే ఎందుకు అడగలేదన్నారు. తమకు.. దమ్ము, ధైర్యం ఉంది కనుకనే ప్రొటోకాల్ పాటించాలని నిలదీస్తున్నామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ సొంత కార్యక్రమంలా నిర్వహిస్తున్నారంటూ ఆగ్రహించిన ఎమ్మెల్యే సబితారెడ్డి, బీఆర్ఎస్ నేతలు కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామన్నారు. సభాస్థలి నుంచి బయటికి వెళ్లిపోయారు.
వేలు ఎత్తితే విరిచేస్తా..
ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతున్న క్రమంలో కొందరు కాంగ్రెస్ నాయలు వేలు ఎత్తి బెదిరించగా.. ‘వేలు ఎత్తుతే విరిచేస్తా’ అని ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ఇండ్ల నుంచి రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ పరంగా ఇస్తున్న రేషన్ కార్డుల పంపిణీలో ప్రోటోకాల్ పాటించకుండా.. ప్రశ్నించినవారిపై దాడులు చేస్తారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎంతోకాలం ఉండదని పోలీసులు, అధికారులు గుర్తించుకోవాలన్నారు. మహిళా నాయకులని కూడా చూడకుండా వారిపై పోలీసులు దాడి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. పోలీసులు పరిధి దాటి ప్రవర్తిస్తే తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగిస్తామన్నారు.
బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల దాడి..
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై పోలీసులు ప్రతాపం చూపించారు. సభలో ప్రోటోకాల్ రగడ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు పిడుగుద్దులు కురిపించారు. కాగా, పోలీసుల దాడిలో బీఆర్ఎస్ నాయకుడు ఎంఏ సమీర్ తీవ్రంగా గాయపడటంతో పాటు స్పృహ కోల్పోయాడు. వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే మరింత రెచ్చిపోయిన పోలీసులు.. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను సభా ప్రాంగణం నుంచి బయటకు పంపిచేశారు. ఈ తోపూలాటలో పలువు రు బీఆర్ఎస్ శ్రేణులకు గాయాలయ్యా యి. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త సమీర్‌ను.. ఆస్పత్రికి వెళ్లి ఎమ్మెల్యే పరామర్శించారు.
జర్నలిస్టులపైనా పోలీసుల దాడులు
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమ కవరేజీ కోసం వచ్చిన జర్నలిస్టులపైనా పోలీసులు దాడులు చేశారు. ప్రోటోకాల్ రగడను వీడియో తీస్తున్న జర్నలిస్టు సంతోష్, ప్రవీన్, ఇతర జర్నలిస్టులను వీడియో కవరేజీ చేయవద్దంటూ కెమెరాలను లాక్కోవడంతో పాటు వారిని తోసివేశారు. దీంతో జర్నలిస్టులు పెద్ద సంఖ్య లో నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. ‘మంత్రి శ్రీధర్‌బాబు డౌన్ డౌన్’ అ ంటూ నినాదాలు చేశారు. జర్నలిస్టులపై దాడిని ఎమ్మెల్యే సబితారెడ్డి తీవ్రంగా ఖం డించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే జర్నలిస్టుల పై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా ముగించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అక్కడి నుంచి వెనుదిరిగారు.