బడంగ్‌పేట, జూన్ 21: మహేశ్వరం మండలంలో పంటలు చూసైనా..రైతు భరోసా ఇవ్వాలని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రియల్ బూచి చూపించి.. ఎగ్గొట్టే ప్రయత్నం చేయవద్దన్నారు. శనివారం మహేశ్వరం మండల పరిధిలోని మన్సాన్పల్లి గ్రామంలో ఉన్న రైతులు యాదమ్మ, జంగయ్య, బాల్‌రాజ్ వేసిన వరి, చిక్కుడు పంటలను ఆమె బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఉన్న 19 మండలాల్లో రైతు భరోసాను నిలిపివేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లాలో మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఉందని, రైతులు వ్యవసాయం చేయడం లేదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి దాదాపుగా రెండు లక్షల ఎకరాల పొలాలకు సంబంధించిన రైతు భరోసా ఇవ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగారెడ్డి జిల్లాలో నిజంగా రైతులు వ్యవసాయం చేస్తున్నారో, చేయడం లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా కేబినెట్ తీర్మానం చేయడం ఏమిటని ప్రశ్నించారు.
రంగారెడ్డి జిల్లా రైతులపై ముఖ్యమంత్రి కక్షగట్టారన్నారు. ముఖ్యమంత్రికి చూపించేందుకే రైతులు వేసిన పంటల వద్దకు వచ్చామన్నారు. అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు అనేక హామీలను ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేకనే రైతు భరోసాను ఇవ్వడం లేదన్నారు.
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు రైతుభరోసా రాలేదని రైతులు బాలరాజ్, జంగయ్య, యాదమ్మ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వివరించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో సమయానికి రైతుబంధు అందినట్లు చెప్పారు. రైతులను కలిసిన తర్వాత ఎమ్మెల్యే మన్సన్పల్లి రోడ్డును పరిశీలించారు. అభివృద్ధి పనులను వేగవంతంగా చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాండు యాదవ్, వెంకటేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు.