బడంగ్‌పేట,నవంబర్11 : నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చెరువులను( Ponds) ఒక విజన్‌తో అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) అన్నారు. మహేశ్వరం నియోజక వర్గంలోని అల్మాస్గూడ పోచ్చమ్మకుంట సుందరీకరణ పనులను సోమవారం ఆమె పరిశీలించారు. చెరువు చుట్టు తిరిగి సుందరీకరణ పనులు పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందని అధికారులను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో ఉన్న పూడిక తీయించిన విషయాన్ని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు మురికి కూపాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం చెరువులలో ఉన్న గుర్రపు డెక్కను తొలగించే పరిస్థితి లేదని ఆమె మండి పడ్డారు. బాలాపూర్ మండలంలోనే 42 గొలుసు కట్టు చెరువులు ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. అన్ని చెరువులలోకి మురుగు నీరు వస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పోచ్చమ్మకుంట సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆమె అధికారులకు ఆదేశించారు.