ఆర్కేపురం, డిసెంబర్ 31 : తనపై నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించిన మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సరూర్‌నగర్ డివిజన్లోని ఓ ఫంక్షన్హాల్లో డివిజన్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ సరూర్‌నగర్ డివిజన్లో తన గెలుపు కోసం అత్యధిక మెజార్టీ ఇచ్చిన డివిజన్ ప్రజలను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటానని తెలిపారు. నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో చేసిన అభివృద్ధి పనులే తన గెలుపునకు దోహదపడిందని చెప్పారు.
సరూర్‌నగర్ డివిజన్లో ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తానన్నారు. కార్యకర్తలకు, ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుండి పోరాడుతానని చెప్పారు. నియోజకవర్గంలో ఎంతో కష్టపడి ఫార్మాసిటీ తీసుకొని వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కారణాలు చూపకుండా రద్దు చేసిందని, వేలాదిమందికి ఉపాధి అవకాశాలు కల్పించే అనేక ప్రాజెక్టులను నియోజకవర్గంలో తీసుకొచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్‌శర్మ, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్వింగ్ మాజీ అధ్యక్షుడు లోకసాని కొండల్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బోయిని మహేందర్ యాదవ్, డివిజన్ మాజీ అధ్యక్షులు ఇంటూరి అంకిరెడ్డి, రిషి తదితరులు ఉన్నారు.