బడంగ్‌పేట, అక్టోబర్26: ప్రజా పాలన అని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం మహేశ్వరం మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. తులం బంగారం కూడా ఇవ్వాలని లబ్ధిదారులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని నినదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు.
ముఖ్య మంత్రి చెబుతున్నదానికి, మంత్రులు చెబుతున్న మాటలకు పొంతన లేదన్నారు. రైతు రుణమాఫీ పై తలో మాట చెబుతున్నారన్నారు. రూ. 45వేల కోట్లు రైతులకు ఇస్తామని చివరకు పది వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఎన్ని నెరవేర్చారని ఆమె ప్రశ్నించారు. రైతు బంధు పదిహేను వేలు ఇస్తామని ఉన్నవి బంద్ చేశారన్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తానన్న హామీ ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలన్నారు. వృద్ధులకు నాలుగు వేల పింఛన్ ఇస్తామని అసలు పింఛన్‌కు ఎసరు తెస్తున్నారన్నారు.
మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ అడగ కుండానే అన్ని ఇచ్చారని ప్రజలు చెబుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కేసీఆర్ పాలన అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేదని ఏ గ్రామానికి పోయిన రైతులు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కన్నీళ్లు మిగులు తున్నాయన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ఎంతో మంది పేదల ఇండ్లను కూల్చి వారిని నిరాశ్రయులను చేస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదిహేను రోజులకోసారి పోలీసులకు 4 రోజులు సెలవు ఇచ్చే వారన్నారు. ఇప్పుడు 40 రోజులకు ఒక్కసారి కూడా సెలవు ఇవ్వక పోతే ఆ కుటుంబాలు ఏమైపోవాలన్నారు. చంటి పిల్లలతో వచ్చి నిరసన తెలియజేయడానికి వస్తే పోలీసులతో కొట్టిస్తున్నారని ఆమె ఆవేదన చెందారు. ప్రజలు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో మహేశ్వరం తహసీల్దార్ సైదులు, ఎంపీడీవో శైలజా రెడ్డి, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.