బడంగ్ పేట్, జూన్ 18: ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా అధ్యాపకులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కళాశాలను, ప్రభుత్వ పాఠశాలను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి కూర్చొని అధ్యాపకులు బోధించే పాఠ్యాంశాలను ఆమె శ్రద్ధగా విన్నారు. ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడారు. ఇలా చదువుతున్నారని విద్యార్థులను అడిగారు. కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అధ్యాపకులు బోధించే పాఠ్యాంశాలను శ్రద్ధగా విని బాగా చదువుకోవాలన్నారు. విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
విద్యా ప్రమాణాలపై అధ్యాపాకులతో ఆమె చర్చించారు. ప్రభుత్వ పాఠశాలను గ్రేడ్ చేయించాలని ఎంఈఓ కృష్ణయ్యకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటుచేసిన భవనంలో 5, 6, 7, 8 తరగతులు నిర్వహించాలని ఆమె అధ్యాపకులకు సూచించారు. ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు అధ్యాపకులు ఆమె దృష్టికి తీసుకురాగా.. విద్యాశాఖ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ లెక్చరర్లు లేరని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆమె విద్యాశాఖ అధికారులతో మాట్లాడి లెక్చరర్లను భర్తీ చేసే విధంగా చూస్తానని తెలిపారు. కళాశాలలో ఉన్న సమస్యలను తప్పకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. మంచి ఫలితాలు వచ్చే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో మెరుగైన సేవలు అందించేందుకు అధ్యాపకులు దృష్టి సారించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణయ్య, ప్రధానోపాధ్యాయులు, కాంతారావు, నాయకులు అరకల కామేష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, సునీత బాలరాజ్, శ్రీను నాయక్, మర్రి నర్సిరెడ్డి, అధ్యాపకులు ఉన్నారు.
షార్ప్ కిడ్స్ ఫ్రీజోన్ స్కూల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంది హిల్స్‌లో షార్ప్ కిడ్స్ ఫ్రీజోన్ స్కూల్ ను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. పిల్లల భవిష్యత్తు నిర్మాణానికి బలమైన పునాది వేయాలన్నారు. స్కూల్‌ను ఆధునిక పద్ధతుల్లో ప్రారంభించడం హర్షనీయమని ఆమె పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా చొరవ తీసుకోవాలన్నారు.