బడంగ్ పేట, ఫిబ్రవరి 9 : మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరులో ఫార్మసిటీ ఉన్నట్లా లేనట్లా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రం గూడ గడ్డం ఇంక్లేవ్ కాలనీలో ఆదివారం ఆమె సీసీ కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం 14000 ఎకరాలను సేకరించి పెట్టిందన్నారు.
ఫార్మాసిటీని కాదని ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నదని, ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్న చోటనే ఫోర్త్ సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారన్నారు. భూమి ఉన్న తర్వాత భూమి సేకరించాల్సిన అవసరం ఏముందన్నారు. కొడంగల్ లో మరో వెయ్యి ఎకరాలు ఎందుకోసం తీసుకుంటున్నారో తెలియదన్నారు. కోడంగల్ రైతుల సమస్య పైన ఇప్పటివరకు ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి నిధులు తీసుకు వచ్చే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి, ఏనుగు రాంరెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, అశోక్, ముత్యాల కృష్ణ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.