ఇబ్రహీంపట్నం రూరల్, అక్టోబర్ 20 : అసత్య ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy )అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బొంగుళూరు సమీపంలో ఆదివారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా సమ్మేళనం కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీని రద్దుచేసి తిరిగి రైతుల భూములు(Pharmacy lands) రైతులకు ఇప్పిస్తామని ఎన్నికల ముందు ప్రచారం చేశారు.
నేడు అధికారంలోకి రాగానే మాటమార్చారని విమర్శించారు. ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించటం కోసం పొల్యూషన్ రహిత ఫార్మాసిటీ ఏర్పాటుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుడితే…నేడు అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు ఆ ప్రాంతంలో నాలుగు రకాల పేర్లుపెట్టి ఇష్టానుసారంగా దండుకుంటున్నారని మండిడ్డారు. ఈ విషయంపై ఫార్మాసిటీ ప్రాంత రైతులు కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. ఫార్మాసిటీని రద్దుచేస్తున్నామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేస్తే వెంటనే రైతుల భూములు వారికి తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై త్వరలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఫార్మాసిటీ ప్రాంతంలో ఇంటింటికి పర్యటించి కాంగ్రెస్ నాయకుల మోసాలను ఎండగడుతామన్నారు.