శంషాబాద్ రూరల్, మార్చి 20 : అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతుల పంటలు ఎండిపోతున్నా… పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విమర్శించారు. కనీసం ప్రజలకు తాగునీరు ఇవ్వలేని దుస్థితిలో సర్కారు ఉందన్నారు. బుధవారం శంషాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య, అరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీలు వాణిదేవి, దయానంద్గుప్తాతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించిన కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపునకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గణేశ్‌గుప్తా, కార్తిక్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.