మల్కాజిగిరి, ఆక్టోబర్ 1: క్యాబ్ డ్రైవర్ల(Cab drivers) సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Rajasekhar Reddy )అన్నారు. మంగళవారం బోయిన్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఓలా, ఊబర్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను కలసి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రల కార్లు హైదరాబాద్‌లో నడపడం వల్ల స్థానికులకు ట్రిప్పులు దొరకడంలేదని, సమస్యను పరిష్కరించాలని వినతిప్రతం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓలా, ఊబర్ క్యాబ్‌లు నడుపుతూ జీవనం సాగిస్తున్న వారికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్లు నగరంలో నడపడం వల్ల స్థానికులు నష్టపోతున్నట్లు గుర్తించామని అన్నారు. కంపెనీలు ట్రిప్పులు తగ్గించడం వల్ల రోజు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఎమ్మెల్యే ఫోన్ ద్వారా సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. వెంటనే స్పందించిన కమిషనర్ సమస్యలు సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగేష్, కుమార్, నరేందర్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.