బడంగ్‌పేట, డిసెంబర్ 14: మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఉన్న ఎస్‌వైఆర్ గార్డెన్లో నిర్వహించిన కృతజ్ఞత సభకు ఆమె హాజరయ్యారు. ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కాలనీల వాసులు సబితారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
మహేశ్వరం నియోజకవర్గం ప్రజల గొంతుగా ఉంటానన్నారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. భవిష్యత్‌లో ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలన్నారు. ప్రజలందరి దీవెనలు కేసీఆర్‌పైన ఉండాలన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రజల మధ్యకు రావాలన్నారు. మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. విజయానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులకు, బీఆర్ఎస్, కాలనీల అసోసియేషన్ నాయకులకు, అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.మేయర్ దుర్గాదీప్‌లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కామేశ్ రెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.