సికింద్రాబాద్, మే 4 : ఓటరు జాబితా సవరణ కోసం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని, పొరపాట్లు జరిగితే తీవ్రంగా పరిగణిస్తామని ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై సోమవారం సీతాఫల్మండిలోని క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో పద్మారావుగౌడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ మాట్లాడుతూ.. ప్రజల్లో అపోహలను తొలగించాలని, అర్హులందరి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చాలని అధికారులను కోరారు.
బీఎల్ఓలకు కల్పించాల్సిన సదుపాయాలను, చెల్లించాల్సిన బకాయిలపై ఉన్నతాధికారులకు నివేధించాలని సూచించారు. ఓటర్ల సందేహాలను ఎప్పటికప్పుడు తీర్చుతూ అవగాహన కల్పించాలన్నారు. జాబితాలో ఖచ్చితత్వం ఉండాలని, పేర్లలో లోపాలను సవరించడంలో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఎట్టి పరిస్థితిలో అర్హులైన వారి పేర్లు గల్లంతు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో తార్నాక సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధీర్సింగ్, అధికారులు సాయిబాబా, మల్లికార్జున్, బీఎల్ఓలు, మాజీ కార్పొరేటర్లు హేమ, సునీత, ప్రసన్నలక్ష్మీ, శైలజ, నేతలు అలకుంట హరి, ప్రకాష్, కృష్ణలతో పాటు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.