చిక్కడపల్లి, అక్టోబర్ 28: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని , ప్రజా సమ్యలపై నిత్యం ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొన లేక ఆయనను మానసికంగా దెబ్బ తీసేందుకు సర్కార్ కుట్రలు చేస్తుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం సాయంత్రం గాంధీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఇంట్లో జరిగిన దావత్‌ను రేవ్ పార్టీగా చిత్రీకరించడం దారుణమన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న కేటీఆర్‌కు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో దావత్ చేస్తే తప్పకుండా విందులో మద్యం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం అన్నారు.
అది ఏదో తప్పు చేసినట్లు చిత్రీకరిస్తున్నారని అన్నారు. రాజ్ పాకాల వారి కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య జరుపుకున్న పార్టీలో డ్రగ్స్ వాడారని అసత్య ప్రచారం చేశారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరవలేరని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం ద్వారా ప్రత్యేక తెలంగాణ సాధించడంతో పాటు, తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. కానీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీర్ కుటుంబ సభ్యుల ఇమేజ్ తగ్గించాలని వారిపై బురద చల్లుతూ, కుట్రలు చేస్తున్నారని అన్నారు. అయితే, ఆకాశం వైపు చూస్తూ ఉమ్మేస్తే ఏమవుతోందో తెలిస్తే.. సదరు నేతలు అలాంటి ప్రయత్నాలు చేయడానికి కూడా సాహసించరని హెచ్చరించారు.