మల్కాజిగిరి, నవంబర్ 7: ఓటరు నమోదును సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల ప్రణాళిక సమావేశంలో ఎమ్మెల్యే గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఒకే కుటుంబంలోని భార్యాభర్తలకు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉండటంతో ఇబ్బందులు వస్తున్నాయని, కుటుంబాన్ని ఒకే పోలింగ్ బూత్‌ను కేటాయించాలన్నారు. ఓటరు నమోదులో ఆశా వర్కర్ల సేవలు వినియోగించుకుని వారికి పారితోషకం ఇవ్వాలన్నారు.
గతంలో పాల్గొన్న వారికి పారితోషకం అందకపోవడంతో వారు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. జియో ట్యాగింగ్ సక్రమంగా నిర్వహించాలన్నారు. అర్హులైన వారి పేర్లు నమోదు చేయాలని, ఓటు హక్కును అందరు ఓటు వేసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరి, ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ అహ్మద్ నదీం, కలెక్టర్ గౌతం పాత్రో తదితరులు పాల్గొన్నారు.