మేడ్చల్, జూలై30(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా భూములు కేటాయించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరికి బుధవారం మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో వచ్చి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్‌రెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మాట్లాడుతూ మేడ్చల్-మల్కాజిగిరి-హైదరాబాద్ జిల్లాల మధ్య ఉన్న 844 ప్రభుత్వ సర్వే నంబరైన భూమిలో 55 ఎకరాల్లో కబ్జాలకు గురువుతున్నాయని,తక్షణమే వాటికి హద్దులను గుర్తించాలన్నారు.
గుర్తించిన భూమిలో యూపీహెచ్‌సీలు, మల్టీ ఫంక్షన్‌హాళ్లు నిర్మించేలా భూములను కేటాయించాలన్నారు. అలాగే ముస్లిం, క్రిస్టియన్ల శ్మశాన వాటికల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని 278, 171, 22, 23 ప్రభుత్వ సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఉన్న కబ్జాలను తొలగించి స్వాధీనం చేసుకోవాలన్నారు.
వివిధ అభివృద్ధి పనులకు 15 ఫైనాన్స్ కమిషన్ ప్రకారం నిధులు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ భూములు కేటాయిస్తే ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవచ్చని మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంంలో అత్యధికంగా బ్రాహ్మణులు ఉన్నందున వారి సౌకర్యాల కోసం బ్రాహ్మణ కమ్యూనిటీ నిర్మాణానికి స్థలం కేటాయించాలని మర్రి రాజశేఖర్‌రెడ్డి కలెక్టర్ మను చౌదరిని కోరారు.
పేద బ్రాహ్మణులు అవసరాలకు వాడుకునే విధంగా భవన నిర్మాణానికి స్థలం ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ భూములన్నింటి ఏడీ సర్వే చేయించి హద్దులను గుర్తించాలని మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. హద్దులు గుర్తిస్తే కబ్జాలకు గురికాకుండా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్, అనిల్ కిశోర్‌గౌడ్, తోట నరేందర్‌రెడ్డి, డోలి రమేశ్, చిన్నాయాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.