మల్కాజిగిరి, మే 2 : ప్రభుత్వం డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు. శుక్రవారం మచ్చ బొల్లారంలోని డ్రైనేజీ సమస్యను పరిశీలించడానికి ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఫార్చ్యూన్ ఎంక్లేవ్ కాలనీలో డ్రైనేజీ అవుట్లెట్ సమస్య తీవ్రం గా ఉందని అన్నారు. ఇక్కడ వివిధ హై రైజ్ బిల్డింగ్ల సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా వదిలిన మురుగునీరు అంత రోడ్లపైకి వస్తుందని తెలిపారు. మురుగు నీటి వల్ల ఫార్చ్యూన్ ఎన్క్లేవ్ కాలనీ వారికి దారి లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చిన్నపిల్లలు స్కూలుకు వెళ్లాలన్నా, గర్భిణులు హాస్పిటల్స్ కి వెళ్లాలన్నా, సీనియర్ సిటిజన్స్ పనులపై బయటికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
అవుట్లెట్ సమస్యను పరిశీలించిన తర్వాత పైపులైన్ బాక్స్ డ్రైన్ ఏర్పాటుచేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధికారులు ప్రతిపాదనలు చేశారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించామని చెప్పారు.