Kalyanalakshmi | నేరేడ్మెట్, జనవరి 31 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఎప్పుడిస్తారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. మల్కాజిగిరి మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నాడు 36 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తులం బంగారం కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారని తెలిపారు.
ఎన్నికల ముందు తులం బంగారం ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది దాటినా తులం బంగారం ఇవ్వడం లేదని మర్రి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. చేతగాని ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాట చేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను ఎప్పుడు తీరుస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. కాంగెస్ ప్రభుత్వం మోసపూరిత విధానాలపై బీఆర్ఎస్ పార్టీ తరపున నిరంతరం పోరాడుతామని తెలిపారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదని, బీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మర్రి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. అర్హులకు తులం బంగారం ఎప్పుడిస్తారని తహసీల్దార్ కార్యాలయంలో నినాదాలతో నిరసన తెలిపారు.