కంటోన్మెంట్, మే 3: కండువాలు మార్చడమే కాంగ్రెస్ నైజమని, పేదల బతుకుల్లో వెలుగులు బీఆర్ఎస్తోనే సాధ్యమని కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. కంటోన్మెంట్ అభివృద్ధే ఊపిరిగా 30 ఏండ్ల పాటు సేవ చేసిన దివంగత ఎమ్మెల్యే సాయన్నను ప్రజలు మరిచిపోలేదన్నారు. ఈ మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ వైఖరితో పాటు ఎన్నికల ప్రచార సరళిపై శుక్రవారం బోయిన్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డితో కలిసి కంటోన్మెంట్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రావుల శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు లీడర్లు, క్యాడర్ లేదని.. అందుకే బీఆర్ఎస్ నేతల ఇళ్ల చుట్టూ చక్కర్లు కొడుతూ, నైట్ వాచ్‌మన్ ఉద్యోగాలు చేస్తున్నారని విమర్శించారు. చివరకు కాంగ్రెస్‌కు అభ్యర్థి కూడా లేకపోవడంతో ఇతర పార్టీల నుంచి తెచ్చుకున్నారని చురకలంటించారు. బీఆర్ఎస్ నేతలను ప్రలోభాలకు గురిచేస్తూ, వినకుంటే బెదిరిస్తూ బలవంతంగా కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమా? అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గెలుపు ఖాయమని, తేలాల్సింది మెజార్టీయేనని రావుల శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సాయన్న కూతురు నివేదితను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దళిత ఆడబిడ్డ తండ్రిని, చెల్లిని కోల్పోయి పుట్టెడం దుఃఖంలో ఉంటే ఆ కుటుంబానికి బాసటగా నిలవాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ టికెట్ ఇచ్చారని తెలిపారు. కానీ, కనీస జ్ఞానం లేని కాంగ్రెస్, బీజేపీలు పోటీలో నిలబడి, ఆడబిడ్డపై నిందలు వేయడమేమిటని మండిపడ్డారు. గతంలో ఒకే పార్టీలో ఉన్న నేతలు సాయన్నతో ఉన్న మిత్రృత్వాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు.
ఏడాదికాలంలో తండ్రిని, చెల్లిని కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితకు అందరూ అండగా నిలవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కోరారు. నివేదితను ఏకగ్రీవంగా గెలిపించుకోవాల్సింది పోయి, బలవంతంగా బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటోందని ధ్వజమెత్తారు. సొంత ఇల్లు కూడా లేని సాయన్న కుటుంబానికే ప్రజలంతా సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని గుర్తుచేశారు. మరోవైపు కేంద్ర సర్కారు కంటోన్మెంట్‌కు రావాల్సిన సర్వీస్ చార్జీలను విడుదల చేయకుండా మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. కంటోన్మెంట్లో కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి, మైనంపల్లి లాంటి నేతలు వ్యక్తిగతంగా కక్ష గట్టి తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఆరోపించారు. ప్రచారంలో తనకు లభిస్తున్న స్పందనను చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేక పోతున్నారని అన్నారు. దళిత ఆడబిడ్డనైన తనపై హస్తం నేతలు ఇంత కక్ష కట్టడం ఎందుకు అని ప్రశ్నించారు.
30 ఏండ్లు ప్రజలకు సేవ చేసిన సాయన్న బిడ్డను ఎందుకు వేధిస్తున్నారని నిలదీశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తనను ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. సమావేశంలో బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, భాగ్యశ్రీ శ్యాంకుమార్, లోక్‌నాథ్, సీనియర్ నాయకులు టీఎన్ శ్రీనివాస్, హరి, నర్సింహ ముదిరాజ్తో పాటు పలు వార్డుల బీఆర్ఎస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, మహిళా నేతలు, సాయన్న అభిమానులు పాల్గొన్నారు.