మేడ్చల్, జనవరి 5: మేం తప్పులు చేయం, విద్యా సంస్థలను స్థాపించి పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ గిర్మాపూర్లో ఆదివారం జరిగిన మల్లన్న జాతరకు విచ్చేసిన సందర్భంగా ఆయన సీఎంఆర్ ఘటనపై స్పందిస్తూ సీఎంఆర్ విషయమై మీడియాలో రక రకాలుగా ప్రచారం చేయడం బాధాకరమన్నారు.
తమ విద్యా సంస్థల ద్వారా ఉన్నతంగా సేవలందిస్తున్నామని తెలిపారు. 37 ఏండ్లుగా ఎంతో మందిని ప్రపంచ శ్రేణి ఇంజినీర్లు, డాక్టర్లు, ఫార్మాసిస్టులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 10 వేల బోధన, బోధనేతర సిబ్బందికి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. మేం ఎప్పుడు తప్పులు చేయం, తెలియకుండా తప్పు జరిగితే కూడా బాధ్యత వహించి, తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొంత మంది టీఆర్పీ రేటింగ్ కోసం సీఎంఆర్ ప్రతిష్టను డ్యామేజ్ చేసేలా వార్తలను ప్రసారం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి సంస్థలు ఎక్కువ కాలం నిలవవని అన్నారు.
తన జీవితం ప్రజా సేవకే అంకితం అని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ గిర్మాపూర్లో సొంత నిధులతో నిర్మించిన ముదిరాజ్, రజక సంఘాల భవనాలను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, మంత్రిగా పని చేసే ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలోని 61 గ్రామాలను ప్రభుత్వ, సొంత నిధులతో అందంగా తీర్చిదిద్దానని తెలిపారు.
అన్ని కుల సంఘాలు, 120 ఆలయాల అభివృద్ధికి సొంత నిధులు ఇచ్చినట్టు, రోడ్లను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. తన సేవలను గుర్తించిన నియోజకవర్గ ప్రజలు మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు కూడా ప్రజా సేవలోనే ఉంటారని అన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, నాయకులు సురేశ్ రెడ్డి, రణదీప్ రెడ్డి, రాజిరెడ్డి, జగన్ రెడ్డి, నవీన్ రెడ్డి, నాగరాజు, భద్రారెడ్డి పాల్గొన్నారు.